అశ్లీల నృత్యాలపై విచారణకు ఆదేశం
విశాఖ : పవిత్ర పుణ్యక్షేతం సింహాచలంలో వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాల ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ స్పందించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ఆయన వేటు వేశారు. సింహాచలంలో వినాయకచవితి భద్రతా విధుల్లో ఉన్న ఏసీపీ భీమారావు, సీఐ బాల సూర్యారావులను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణకు యోగానంద్ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై అడిషనల్ సీపీ సత్తార్ ఖాన్ విచారణ జరపనున్నారు.
కాగా అప్పన్న ఆలయం సమీపంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అశ్లీలం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మద్యం సేవించిన కొందరు యువకులు ఓ మహిళా డ్యాన్సర్ తో అసభ్యకర భంగిమల్లో నృత్యం చేయించారు. పోలీసులు పెట్రోలింగ్ కు వచ్చినా ఎదురుగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో రాత్రి మొదలయిన ఈ నృత్యాలు తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వార్తలు మీడియాలోనూ ప్రసారం కావటంతో విశాఖ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు.