ట్రైనింగ్‌లో గున్న ఏనుగు పాస్
- పూర్తి కానున్న శిక్షణ
- మరో వారం రోజుల్లో సందర్శకుల వీక్షణకు సిద్ధం
ఆరిలోవ(విశాఖ) : ఇందిరాగాంధీ జూ పార్కులో శిక్షణ పొందుతున్న గున్న ఏనుగు మరో వారం రోజుల్లో సందర్శకులను అలరించనుంది. ఈ గున్న ఏనుగు ఏడాది మేలో విజయనగరం జిల్లా సాలూరు పరిసరాలలో పంటపొలాల్లో తిరిగి అక్కడ రైతులను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. దీంతో అటవీశాఖ అధికారులు చిత్తూరు జిల్లాలో కుప్పం ఏనుగుల క్యాంప్ నుంచి రెండు ఏనుగులను సాలూరు తీసుకొచ్చారు. 'ఆపరేషన్ గజ'లో భాగంగా వాటి సహాయంతో అక్కడ హల్‌చల్ చేస్తున్న గున్న ఏనుగును పట్టుకొని విశాఖ జూ పార్కుకు తరలించారు. అడవుల్లో తిరిగే ఈ గున్న ఏనుగుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇక్కడ సందర్శకులకు అలవాటు పడే విధంగా జూ అధికారులు తీర్చిదిద్దుతున్నారు.
దానికి తర్ఫీదు ఇవ్వడానికి కుప్పం క్యాంప్ నుంచి ఏనుగులకు శిక్షణ ఇచ్చే ఇద్దరు నిపుణులను ఇక్కడకు తీసుకొచ్చారు. వారు గున్న ఏనుగుకు 25 కమేండ్స్(సైగలతో కూడిన శిక్షణలో విభాగాలు)లో శిక్షణ ఇచ్చారు. కుప్పం క్యాంప్ నుంచి వచ్చిన ఏనుగులు కూడా శిక్షణలో సహకరిస్తున్నాయి. శిక్షణ ముగిశాక వాటిని తిరిగి కుప్పం క్యాంప్ తరలించే అవకాశం ఉంది.