విశ్వసాహిత్యాన్ని మథించిన ‘పోతుకూచి’
-
ఆయన స్వీయచరిత్ర రాస్తే భావికి మేలు
-
‘జ్ఞాపకాలు’ ఆవిష్కరణలో ఎండ్లూరి
రాజమహేంద్రవరం కల్చరల్ :
ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతస్థాయిలో అధ్యయనం చేసిన అతి కొద్దిమందిలో పోతుకూచి సూర్యనారాయణమూర్తి ఒకరని తెలుగు విశ్వ విద్యాలయం సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు, పాత్రికేయుడు, రచయిత పోతుకూచి సూర్యనారాయణమూర్తి రచించిన ‘జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ సభ శనివారం కళాగౌతమి ఆధ్వర్యంలో ప్రకాశ్ నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎండ్లూరి మాట్లాడుతూ కాకినాడలో జరిగిన ఆంధ్రాభ్యుదయ ఉత్సవాలలో ఒక పెద్దమనిషి తనను అవమానించినట్టు మహాకవి జాషువా స్వీయచరిత్రలో పేర్కొన్నారని, అయితే ఆ సంఘటన పూర్వాపరాలను పోతుకూచి తన ‘జ్ఞాపకాలు’లో వివరించారని అన్నారు. సాక్షాత్తు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంతటి వాడి మాటలు జాషువాను మనస్తాపానికి గురి చేశాయని, ఈ సంఘటనను పోతుకూచి ‘జ్ఞాపకాలు’లో నిబద్ధతతో పేర్కొన్నారని ప్రశంసించారు. పోతుకూచి స్వీయచరిత్రను రాయాలని, అది ముందుతరాల వారికి ఉపకరిస్తుందని అన్నారు. ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి ‘జ్ఞాపకాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నగరానికి తలమానికమైన న్యాయవాది పోతుకూచి అని ఆయన అన్నారు. పుస్తక సమీక్షకుడు బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ విఖ్యాత విజ్ఞాన దీపకళిక పోతుకూచి అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన పేరు తెలియనివారు ఉండరన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ నిబద్ధత కలిగిన న్యాయవాది పోతుకూచి అని, ఆయన ప్రతిభను రాజమహేంద్రికి పంచిపెడుతున్నారని అన్నారు. కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ పోతుకూచి ఏ విషయాన్ని అయినా వివరించేటప్పుడు ఆయనలో భావాలు ఉప్పెనలా తన్నుకు వస్తాయని, ఆయన నడిచే గ్రంథాలయమని కొనియాడారు. ఈ ఊరు ఆయనకు తగిన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది చేబియ్యం వెంకట్రామయ్య మాట్లాడుతూ జీవిత సాఫల్యపురస్కారానికి పోతుకూచి పూర్తిగా అర్హులన్నారు. తన సొంత ఖర్చుతో పోతుకూచిని త్వరలో భారీస్ధాయిలో సత్కరిస్తానని తెలిపారు. పలువురు నగర సాహితీవేత్తలు పోతుకూచిని సత్కరించారు.కళాగౌతమి కార్యదర్శి ఫణి నాగేశ్వరరావు స్వాగత వచనాలు పలికారు. డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి, డాక్టర్ డి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం, మధుర ఫాలశంకర శర్మ, డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్, జి.సూర్యారావు తదితరులు హాజరయ్యారు.