కనీస వేతనం కోసం వీఆర్‌ఏల ధర్నా
మచిలీపట్నం (చిలకలపూడి) : గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖలో కీలకంగా పని చేస్తున్న తమకు కనీస వేతనం చెల్లించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 151 ప్రకారం వీఆర్‌ఏలకు కనీస వేతనం నెలకు రూ.18 వేలు 010 పద్దు ద్వారా చెల్లించాలని కోరారు. వీఆర్‌ఏ, అటెండర్, వాచ్‌మన్ తదితర ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. వీటి నియామకంలో వీఆర్‌ఏలకు 75 శాతం పోస్టులను వీఆర్‌ఏలతో భర్తీ చేయాలన్నారు. పదవీవిరమణ చేసిన వీఆర్‌ఏలకు రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా పదవీ విరమణ సదుపాయాలను కల్పించాలన్నారు. రాజధాని, ప్రత్యేక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలకు అదనపు అలవెన్స్‌లు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ బాబు ఏకు వినతిపత్రం అందజేశారు. సంఘ నాయకుడు పి.వి.రాఘవేంద్రరావు, సీఐటీయూ నాయకులు సిహెచ్ రవి, బూర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
104 ఉద్యోగుల ధర్నా
సీఐటీయూ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం 104 కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రన్న సంచార చికిత్స పథకంలో ఉద్యోగులందరికీ జీవో 151 ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. 2016 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ వేతనాలు చెల్లించటం లేదన్నారు. సిబ్బందిని అక్రమంగా బదిలీ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. గ్రామ స్థాయిలో వైద్య సేవలందించే తమకు తగినంత మందులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ బాబుఏకు వినతిపత్రం అందజేశారు.