నేడు ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభోత్సవం
నేడు ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభోత్సవం
Published Fri, Oct 14 2016 9:00 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
మచిలీపట్నం : మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (ఎంఏడీఏ) కార్యాలయ ప్రారంభోత్సవం శనివారం జరగనుంది. పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన నిమిత్తం ఎంఏడీఏ కార్యాలయాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. 2016 ఫిబ్రవరి 1వ తేదీన ఎంఏడీఏను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 15ను విడుదల చేసింది. ఎంఏడీఏ పరిధిలో మచిలీపట్నం పురపాలక సంఘంతో పాటు బందరు మండలంలోని 27 రెవెన్యూ గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామానికి చేర్చారు. 426.16 చదరపు కిలోమీటర్లు, 1,05,306.64 ఎకరాలను ఎంఏడీఏ పరిధిగా నిర్ణయించారు. ఎంఏడీఏ ద్వారా మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం భూసమీకరణ నోటిఫికేషన్‌ను గత నెల 18వ తేదీన విడుదల చేశారు. ప్రస్తుతం ఏడుగురు డెప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. జేసీ గంధం చంద్రుడు ఎంఏడీఏ వైస్‌చైర్మన్‌గా పనిచేస్తుండగా త్వరలో ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు శుక్రవారం తెలిపారు.
కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు :
కలెక్టరేట్ ప్రాంగణంలో రూ. 90 లక్షలతో వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. ఈ నూతన భవనాన్ని ఎంఏడీఏకు కేటాయించారు. రెవెన్యూశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ఈ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించనున్నారు. మచిలీపట్నం ఆర్డీవో పి సాయిబాబు నేతృత్వంలో కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఉపాధి కూలీలను రప్పించే యత్నం :
శనివారం ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి బందరు మండలంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2,500 మందికి పైగా పనిచేస్తుండగా వారందర్ని కలెక్టరేట్‌కు తరలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఉపాధి కూలీలు కార్యక్రమానికి వచ్చినా వారికి మస్తర్ వేయాలని ట్రాక్టర్లు, అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా కలెక్టరేట్‌కు వారిని తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి హాజరుకాకుంటే గతంలో చేసిన పనికి నగదు ఇవ్వమని కూలీలను బెదిరిస్తున్నారని సమాచారం. ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభం అనంతరం కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఏడీఏ కార్యాలయం ఏర్పాటు సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Advertisement