లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో కదిలిన డొంక
బాధ్యులెవరన్నదానిపై తీస్తున్న ఆరా
నాడు పనిచేసిన అధికారుల్లో గుబులు
సెలవుపై వెళ్లేందుకు యత్నాలు
విజయనగరం : ఏసీబీ వలలో చిక్కుకుని విచారణ తరువాత కేసు రుజువై ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి రెండేళ్లపాటు జీతం అందించిన వైనమిది. ఒకరు లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుతో ఆ రహస్యం కాస్తా బట్టబయలైంది. దీనికి బాధ్యులైనవారందరి మెడకూ ఈ ఉచ్చు బిగుసుకుంటుండటంతో రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మెరకముడిదాం మండలంలో వీఆర్వోగా పనిచేసిన ఆర్.చలపతిరావు 2010లో ఏసీబీ వలలో చిక్కుకున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తిరిగి తాత్కాలికంగా భోగాపురంలో ఉద్యోగమిచ్చారు. ఆయన భోగాపురం మండలంలో పనిచేస్తుండగానే ఏసీబీ కేసు రుజువయింది. ప్రభుత్వం ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ ఉత్తర్వులను గతంలో ఆయన పనిచేసిన మెరకముడిదాం మండల తహశీల్దార్ కార్యాలయానికి ఉత్తర్వులు పంపించారు.
ఆ ఉత్తర్వులను సంబంధిత అధికారులు చలపతిరావు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకోకుండా, ఎటువంటి రికార్డులూ నమోదు చేయకుండా వీఆర్వోకు వేరే వ్యక్తి ద్వారా సాధారణంగా భావించి పంపించేశారు. భోగాపురం మండలంలో పనిచేస్తున్న ఆయన ఆ ఉత్తర్వులను దాచేసి అక్కడే ఎంచక్కా రెండేళ్ల పాటు పని చేశారు. ఇదీ జరిగిన కథ! అప్పట్లో కొంత మందికి ఛార్జి మెమోలను కలెక్టర్ ద్వారా చేరాయి. విషయం తెలుసుకున్న కనిమెరకకు చెందిన బగ్గాం ఎర్రయ్య అనే వ్యక్తి తొలగించిన తరువాత రెండేళ్ల పాటు వేతనాలెలా ఇచ్చారంటూ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం పోలీసులకు కూడా పాకింది. వెంటనే దర్యాప్తు మొదలైంది.
బాధ్యులందరి మెడకూ ఉచ్చు !
కలెక్టరేట్‌లోని ఏఓ, ఏ-2 లతో పాటు డీఆర్వో, ఉత్తర్వులను తిప్పి పంపకుండా వ్యక్తుల ద్వారా చేరవేసిన తహశీల్దార్, వేతనాలు ఇచ్చిన ట్రెజరీ సిబ్బంది ఇలా చాలా మంది మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కలెక్టరేట్‌లోని కొన్ని సెక్షన్లకు పోలీసులు వచ్చి అప్పటి కేసుపై ఎవరెవరు బాధ్యులన్న సమాచారాన్ని సేకరించారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్లు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పోలీసులనుంచి ఏ క్షణాన్నైనా పిలుపు వస్తుందేమోనన్న భయంతో అప్పటి ఉద్యోగులు సెలవు పెట్టి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది.