► కొత్త పాలకవర్గానికి
► ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్యపోరు
► ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ ఆస్తులు
మహబూబ్‌నగర్ అర్బన్ : వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. వాటిని పరిరక్షించాల్సిన జిల్లా కమిటీకి రాజకీయ గ్రహణం పట్టుకుంది. అస్తిత్వం కోసం అధికార పార్టీ నాయకులు గత వక్ఫ్ కమిటీ పాలకవర్గాన్ని రద్దు చేయించి సుమారు ఏడాదిన్నర పూర్తవుతోంది. కాంగ్రెస్ హయాంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అధ్యక్షతన జిల్లా వక్ఫ్ కమిటీని వేయగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయనపై కొన్ని ఆరోపణలు చేస్తూ టీఆర్‌ఎస్ నాయకులు పాలకవర్గాన్ని రద్దు చేయించారు. అనంతరం జిల్లా వక్ప్ బోర్డు సీనియర్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ గౌస్‌ను స్పెషల్ ఆఫీర్‌గా నియమించారు. కానీ నూతన కమిటీ వేయడంలో జాప్యం చేశారు.
ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యే మధ్య ఆదిపత్య పోరు నడుస్తుండటంతో ప్రక్రియ ముందుకు సాగడంలేదని మైనార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో రెండు సార్లు చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తినే తిరిగి ఆ పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ బడా నాయకుడు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కొంత మంది మైనార్టీ నాయకులు మంత్రులతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలావుండగా ఇప్పటిదాకా వక్ఫ్ కమిటీ చెర్మైన్‌గా పని చేసిన వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని, ఎవరైనా ముందుకొస్తే తమకూ అదే పరిస్థితి ఉంటుందన్న భయంతో ఎవరూ ముందుకు రావడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సీఎం స్వయంగా కోరినా జిల్లా నాయకులు మిన్నకుండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగి స్తోంది. పాలకవర్గం లేక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తుల దురాక్రమణ పరంపర కొనసాగుతూనే ఉంది. 1954లో దేవాదాయ శాఖ నుంచి వక్ఫ్ బోర్డు విడిపోయినప్పుడు జిల్లాలో 11,800 ఎకరాలున్న భూములు ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలకు చేరాయి.
‘వక్ఫ్’ కమిటీకి రాజకీయ గ్రహణం
Published Sun, Jun 19 2016 9:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM
Advertisement