నీటి పంపిణీని పెంచాలి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): పెన్నా డెల్టాకు సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటి పంపిణీని పెంచాలని జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య నాయకులు కోరారు. ఈ మేరకు హరనాథపురం ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్‌ఈ కోటేశ్వరరావుకు బుధవారం వినతిపత్రం అందజేసిన అనంతరం సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ గోవిందరెడ్డి మాట్లాడారు. సోమశిల ప్రాజెక్ట్ కింద పెన్నా డెల్టా ప్రథమ హక్కును కలిగి ఉందన్నారు. పెన్నా డెల్టాలోని 2.5 లక్షల ఎకరాలకు 3500 క్యూసెక్కులను విడుదల చేసినా, ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఏ చెరువుకు గానీ, డైరెక్ట్ ఆయకట్టుకు గానీ నీరు అందడంలేదని తెలిపారు. సమస్యను గుర్తించి తక్షణమే సోమశిల ప్రాజెక్ట్ నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కులను విడుదల చేయాలని కోరారు. గత ఐఏబీ తర్వాత ప్రాజెక్ట్‌లోకి అదనంగా ఐదు టీఎంసీల నీరు చేరిందని, అప్రువ్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఖరీఫ్ పంటకు ఏయే కాలువలకు ఎంత దామాషా ప్రకారం ఇవ్వాల్సి ఉందో ఆ కేటాయింపులను కచ్చితంగా పాటించాలని కోరారు. జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు ఓబిలి గోవిందరెడ్డి, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి నిరంజన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.