తహసీల్దార్ కార్యాయలం ముందు బైఠాయించి నిరసన తెలుపుతన్న గ్రామస్తులు
ఊరంతా ఊట నీరే
Published Mon, Oct 24 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
- గోరుకల్లు గ్రామస్తుల ఆవేదన
- పునరావాసం కోసం డిమాండ్
- తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయింపు
- అడుగడుగునా పోలీస్ పహారా
పాణ్యం : ‘రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసింది మొదలు గ్రామంలో ఎటు చూసినా ఊటనీరు బయటకు వస్తోంది. కట్ట నుంచి నీరు లీకేజీ అవుతోంది. ఇంటి గోడలు నెమ్మెక్కి పేక మేడల్లా కూలిపోతున్నాయి. రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికే 20 ఇళ్లు కూలిపోయాయి. మరి కొన్నింటి గోడలు చీలికలు ఇచ్చి కుంగిపోతున్నాయి. ఎక్కడ చూసినా దుర్వాసన భరించలేకపోతున్నాం. సమస్య పరిష్కరించాలని కోరుతూ నాలుగు రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టినా అధికారుల్లో స్పందన లేదు’ అంటూ మండల పరిధిలోని గోరుకల్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఇంటికి ఒకరు చొప్పున కదిలి రోడ్డెక్కారు. తొమ్మిది కిలోమీటర్ల మేర పాదయాత్రగా వచ్చిన సుమారు 500 మంది గ్రామస్తులు పాణ్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు.
సర్వం కొల్పోయిన గ్రామస్తులు
గోరుకల్లు రిజర్వాయర్ కోసం గ్రామస్తుల నుంచి 2వేల ఎకరాల భూములను సేకరించిన అధికారులు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఇప్పటికే గ్రామానికి రెండు సార్లు వచ్చిన సీఎం చంద్రబాబు నెల రోజుల్లో పరిహారం అందిస్తామని ప్రకటనలు గుప్పించినా ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. గ్రామంలో 400పైగా ఇళ్లుండగా 3వేల వరకు జనాభా ఉంది. ఉన్న ఇళ్లు ఊటల దెబ్బకు కూలీపోతున్నాయి. ఊట నీరు ఇళ్లలో చేరి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో లీక్ వ్యవహారంపై ప్రభుత్వం ఎక్స్‌పర్ట్ కమిటీనీ ఏర్పాటు చేసినా అందుకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచారు. రిజర్వాయర్ కట్ట నుంచి లీకేజీలను ఆపేందుకు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిన అధికారులు ఆ ఊటలు మాత్రం రిజర్వాయర్‌కు చెందినవి కాదని చెబుతుండడం గమనార్హం.
భారీగా పోలీసుల మోహరింపు..
గ్రామంలో నీటి ఊటల సమస్యపై గ్రామస్తులు ఆందోళన ప్రారంభించడం, విషయాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు వారు హైవేపైకి రాకుండా కొండజుటూరు రోడ్డు వద్ద సిబ్బందిని మోహరించారు. ఐదురుగురు ఎస్‌ఐలు, 70మంది పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి గ్రామస్తులను దొంగు రస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు పంపించారు.
కార్యాలయం వద్దకు చేరుకున్న గ్రామస్తులు ఒక్క సారిగా కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.పోలీస్‌లు తలుపులను మూయడంతో అక్కడే బఠాయించి నిరసన చేపట్టారు.సీపీఎం నాయకులు ఓబులపతి, ప్రభాకర్‌రెడ్డి , రామకృష్ణ, భాస్కర్, అలివేలు, ఉసేన్ గ్రామస్తులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. తహసీల్దార్ చంద్రావతికి వినతిపత్రం అందించారు.
పరిహారం, పునరావాసానికి డిమాండ్..
కూలిపోయిన ఇళ్లు, కోల్పోయిన భూములను తక్షణమే పరిహారం ఇప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి వర్తింపజేయాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గతంలో ఇందుకు మంత్రి హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు అతీగతీ లేదని గ్రామస్తులు తెలిపారు.
పదిరోజులు గడువు ఇవ్వండి.. చంద్రావతి, తహసీల్దార్
గ్రామస్తుల సమస్యపై ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డితో పాటు ప్రత్యేకంగా నాలుగు సార్లు గ్రామంలో పర్యటించాం. కూలిపోయిన ప్రతి ఇంటిని నమోదు చేసి ప్రభుత్వానికి పంపించాం. మరో పదిరోజులు సమయమిస్తే మా పరిధిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. త్రిసభ్య కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశాలించ్చింది. ఆయన కమిటీని నియమిస్తే అందులో సభ్యులుగా ఉన్న ఇంజనీర్లు , రెవెన్యూ అ«ధికారులు త్వరలోనే గ్రామంలో పర్యటించి సమస్యకు కారణాలు తెలుసుకుంటారు. పరిష్కారంపై సూచనలు చేస్తారు.
Advertisement