తాగునీటికి కటకట
తాగునీటికి కటకట
Published Mon, Aug 22 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
ఆత్మకూర్(ఎస్)
మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహడ్ గ్రామంలో వానాకాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. భూగర్భజలాలు అడుగంటి స్కీంబోర్లు పోయకపోవడం, అద్దెబోర్లకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులను మానుకొని నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 6 వేల పైచిలుకు జనాభా కలిగిన తుమ్మలపెన్‌పహడ్ గ్రామంలో గతంలో 18 గ్రామపంచాయతీ బోర్లు ఉండగా వేసవి కాలంలో అదనంగా మరో 10 బోర్లు అద్దెకు తీసుకొని గ్రామానికి నీరు అందించారు. కాగా నేడు అద్దెబోర్లు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో 18 బోర్లల్లో 10 బోర్లు అడుగంటిపోయాయి. 8 బోర్లల్లో సైతం నీరు తక్కువగా వస్తున్నది. దీంతో గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటుంది. ప్రధానంగా పాఠశాల చుట్టుపక్కల, ముదిరాజ్ కాలనీ, ఎన్‌టీఆర్ కాలనీల్లో వారాల తరబడి నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామస్తులు తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా, ఎడ్లబండ్ల ద్వారా వ్యవసాయ బావుల వద్దనుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పాఠశాల సమీపంలో నీటిసంపు వద్ద గంటల తరబడి నిరీక్షించి నీటిని తీసుకువెళ్లుతున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి సమస్య ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పనులు మానుకొని నీళ్లకు వెళ్తున్నాం– దొంతరబోయిన సోమమ్మ
గ్రామంలో తీవ్ర నీటి కరువు ఉంది. అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదు. రోజుల తరబడి నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ పనులు వదులుకొని నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. ట్రాక్టర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసుకుంటున్నాం.
గంటల తరబడి ఎదురుచూస్తున్నాం – పులుగుజ్జు లింగయ్య
గ్రామ పంచాయతీ నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నాం. సంపు వద్ద వచ్చేనీళ్ల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. వానాకాలంలోనే నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం –బెల్లంకొండ మంగమ్మ, సర్పంచ్, తుమ్మలపెన్‌పహాడ్
గ్రామపంచాయతీలో 18 బోర్లకు గాను10 బోర్లు అడుగంటిపోయాయి. 8 బోర్లల్లో నీళ్లు తక్కువగా వస్తున్నాయి. అద్దెబోర్లకు ప్రభుత్వ అనుమతి లేదు. దీంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. సమస్యను అధికారులకు తెలియజేశాం. త్వరలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.
Advertisement
Advertisement