రెండో పంట.. నీటికి తంటా
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : పెన్నాడెల్టాలో మొదటి పంట కోతలు పూర్తి కాకముందే రెండో పంటపై రైతులు దృష్టి సారిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుక్కులు ప్రారంభించారు. కోవూరు, బుచ్చిరెడ్డి పాళెం, సంగం, కొడవలూరు మండలా ల్లో మొదటి పంట కోత దశకు చేరు కుంది. ఈ నేపథ్యంలో రెండో పంట వేసేందుకు ఆ ప్రాంత రైతులు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు.
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మొదటి పంటకే నీరందక రైతులు రోడ్లెక్కిన విషయం తెలిసిందే. ఒక ఎకరా కూడా ఎండ నివ్వమని మంత్రులు, అధికారులు పదేపదే ప్రచార ఆర్భాటం చేశారు. ఈ క్రమంలో గత నవంబర్‌లో ఐఏబీ మీటింగ్‌లో డెల్టా కింద 1.75లక్షల ఎక రాలు, కనుపూరు కాలువ కింద 25వేల ఎకరాలకు సాగునీటిని అంది స్తామని తీర్మానించారు. అయితే మొత్తం 2లక్షల 70వేల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు ఆశించిన మేరకు నీటిని అందించే పరిస్థితులు లేవు. తీవ్ర వర్షాభావం జిల్లాలో నెలకొంది. సాధారణ వర్షపాతం కంటే 69 శాతం వర్షపాతం నమోదైంది. వారాబంది పద్ధతిలో (వారంలో కొన్ని రోజులు) నీటిని అందించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఇష్టారాజ్యంగా మోటార్ల వాడ కం, అక్రమ నీటి తరలింపు రైతుల పాలిట శాపంగా మారింది.
అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాం తంలో పంటలు సాగు చేయడం వల్ల రైతులు తమకు తెలియకుండానే నీటి కష్టాల ను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికితోడు కాలువల పర్యవేక్షణకు లస్కర్లు ఉండా ల్సిన స్థాయిలో లేరు. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో తమకు ఇష్టమైన వారి కే నీరు అందుతోంది. కరెంటు మోటార్ల వినియోగంపై పలుసార్లు సమీక్షా సమావే శాలు జరిగినా ఆశించిన స్థాయిలో రైతులకు మేలు జరగలేదు. ఈ క్రమంలో మొదటి పంట చేతికి రాకముందే కొంత మంది పెన్నా డెల్టా రైతులు రెండో పంటపై దృష్టిసారించడాన్ని పలువురు తప్పుబడు తున్నారు. వేసవిలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోమశిలలో 17.715 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఒక నెల తర్వాత సాగునీటి అవసరాలకు పోను కేవలం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుం దని ఇరిగేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు పడకపోతే వేసవిలో తాగునీటికి సైతం జిల్లా వాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను అధిగమిం చేందుకు రైతుల్లోనే చైతన్యం రావాల్సి ఉంది.
రెండో పంట జోలికి వెళ్లొద్దు
రెండో పంట జోలికి వెళ్లకుండా ఉండటం రైతులకు అన్ని విధాలా మేలు.ఫిల్టర్ పాయింట్‌తో నీటిని అందించాలని ఆశపడటం కూడా సరైన పద్ధతి కాదు. భూగర్భ జలాలు ఇంకిపోతే మొత్తం ఇబ్బంది పడాల్సివస్తుంది. రైతులు ముందు చూపుతో వ్యవహరించాలి. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను తాగునీటి అవసరాలకు వాడుకోవడం మంచిది.
– పి.కృష్ణమోహన్, ఈఈ, నెల్లూరు సర్కిల్ ఆఫీస్