అక్రమ ప్రాజెక్టులతోనే నీటి కష్టాలు
– జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
కర్నూలు సిటీ: కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాల్లో నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్లే దిగువకు నీరు రావడం లేదని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. అక్రమ ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయన్నారు. దీని వల్లే రాయల సీమకు నీటి కష్టాలు వచ్చాయని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కష్ణానదికి తరలిస్తున్నామని.. ఇప్పటీకి 6.3 టీయంసీల గోదావరి జలాలను డెల్టాకు ఇచ్చామన్నారు. అంతే మొత్తంలో రాయలసీమకు ఇవ్వాలని సీఎం ఆదేశించారని, దీంతో శుక్రవారం హంద్రీనీవా ద్వారా, శనివారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేశామన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఈ నెల 15కు పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని, అయితే అక్టోబరు నాటికి గడుపు పెంచామన్నారు. శ్రీశైలం డ్యాం నిండకుండానే దిగువకు నీటిని ఎలా తీసుకెళ్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి నీళ్లు నమిలారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ జిల్లా పరిశీలకులు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.