స్వర్గానికి దారి.. దొరికినట్లే!
Published Fri, Oct 21 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
బ్రాండ్.. బాజా!
- హెచ్‌డీ మద్యం ఇక అధికారికం
- బలవంతంగా అంటగడుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
- చక్రం తప్పిన నంద్యాల ఎంపీ
- అధికార పార్టీ నేత కావడంతో చెల్లుబాటు
- ఒక్కో షాపునకు 300-400 కేసుల సరఫరా
- అమ్ముడుపోక దుకాణదారుల గగ్గోలు
అధికార పార్టీ నేతలు ఏమి చేసినా చెల్లుబాటే. మద్యం మత్తు కుటుంబాలను కాటేస్తున్నా.. మహిళల జీవితాలు నాశనం అవుతున్నా.. వీరికి వ్యాపారమే ప్రధానం. ఎంతలా అంటే.. దుకాణాలకు బలవంతంగా సరుకు అంటగట్టేంత. అది కూడా.. ప్రభుత్వ శాఖను అడ్డం పెట్టుకొని మరీ బరి తెగించడం టీడీపీ నాయకులకే చెల్లుబాటు. స్వర్గానికి దారి పేరిట నరకం చూపుతున్న తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
స్వర్గానికి ద్వారం(హెవెన్ డోర్–హెచ్‌డీ). నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి విడుదల చేసిన ఈ మద్యం బ్రాండ్ ఇప్పుడు జిల్లాలో దుమ్ము రేపుతోంది. ఒక్కో మద్యం షాపునకు కచ్చితంగా 300 కేసుల నుంచి 400 కేసుల వరకూ సరఫరా అవుతోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ సిబ్బంది మద్యం షాపులకు లక్ష్యాలు విధించి మరీ హెచ్‌డీ మద్యాన్ని కేసులకు కేసులు సరఫరా చేస్తున్నారు. కేవలం గత సెప్టెంబర్ నెలలోనే జిల్లాలోని మద్యం షాపులకు హెచ్‌డీ బ్రాండ్ మద్యం ఏరులై పారింది. తాజా పరిణామాలతో అధికారపార్టీలో చేరినందుకు ఆయనకు స్వర్గానికి దారి దొరికిందేమో కానీ.. మాకు మాత్రం నరకానికి దారి కనిపిస్తోందని మద్యంషాపుల యాజమాన్యాలు వాపోతున్నారు. కొనుగోలు చేసిన సరుకు అమ్ముడుపోక.. మిగిలిన సరుకు ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తాము కొనుగోలు చేయమంటే.. ఏ బ్రాండ్ మద్యం ఇచ్చేది లేదని ఎక్సైజ్ సిబ్బంది బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా జిల్లాలోని మద్యం షాపులన్నీ ఇప్పుడు హెచ్‌డీ బ్రాండ్లతో నిండిపోయాయి. కొన్ని షాపుల్లో ఏకంగా 200 కేసుల వరకూ ఇప్పుడు హెచ్‌డీ స్టాక్ మూలుగుతోంది.
కోట్ల మద్యం
జిల్లాలో మొత్తం 203 మద్యం దుకాణాలు ఉండగా.. ఒక్కో మద్యం దుకాణానికి 200 నుంచి 400 కేసుల వరకూ హెచ్‌డీ మద్యాన్ని సరఫరా చేశారు. కర్నూలు నగరంలో ఒక్కో షాపునకు 400 కేసులు సరఫరా చేస్తుండగా.. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న షాపులకు 200–300 కేసులను అంటగడుతున్నారు. ఈ లెక్కన సగటున ఒక్కో షాపునకు 250 కేసుల మద్యాన్ని లెక్కించినా.. 203 షాపులకు 50,750 కేసుల మద్యం సరఫరా అయ్యిందన్నమాట. ఒక్కో కేసుకు రూ.2 వేల చొప్పున రూ.10 కోట్లకుపైగా హెచ్‌డీ మద్యం కేవలం అక్టోబర్ నెలలో మాత్రమే సరఫరా చేయడం గమనార్హం. అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో మద్యం షాపులన్నీ ఇప్పుడు స్వర్గ జపం చేస్తున్నాయి.
ఎక్సైజ్ సిబ్బంది టార్గెట్
తమ మద్యాన్ని విక్రయించుకునేందుకు అధికార పార్టీ నేత దగ్గరిదారి ఎంచుకున్నారు. ప్రత్యేకంగా మార్కెట్ టీం ఎందుకులే అనుకున్నారో ఏమో నేరుగా ఎక్సైజ్ సిబ్బందికే లక్ష్యాలు విధించారు. ఒక్కో ఎక్సైజ్ సీఐ స్టేషన్ పరిధిలో ఒక్కో మద్యం షాపు కచ్చితంగా 300 నుంచి 400 కేసుల వరకూ కొనుగోలు చేసేలా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఇప్పించారు. ఫలితంగా జిల్లాలోని అన్ని మద్యం షాపులు 300 నుంచి 400 కేసుల వరకూ హెచ్‌డీ మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒక్కో కేసులో 12 మద్యం సీసాలు ఉంటారు. అది కూడా ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ కావడం గమనార్హం. ఈ విధంగా ఒక్కో కేసును రూ.2 వేలు చెల్లించి మరీ మద్యం షాపు యాజమాన్యాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒక్కో కేసుకు రూ.2 వేల చొప్పున లెక్కిస్తే 300 కేసులకు రూ.6 లక్షలు, 400 కేసులైతే రూ.8 లక్షలు చెల్లించి మరీ కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం షాపుల యజమానులు వాపోతున్నారు.
Advertisement
Advertisement