
వైఎస్ జగన్‌కు అండగా ఉంటాం: సుధీర్‌రెడ్డి
- మైసూరా సోదరుడి కుమారుడు సుధీర్‌రెడ్డి
యర్రగుంట్ల (కడప): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటామని జమ్మలమడుగు పార్టీ ఇన్‌చార్జి సుధీర్ రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీకి మైసూరారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం రాత్రి ఆయన సోదరుడు కుమారుడు సుధీర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఈ సంద్భరంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబం వైఎస్‌ఆర్ సీపీకి, వైఎస్ జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. తన పెదనాన్న మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సుధీర్ రెడ్డి తెలిపారు. పెదనాన్నతో ఇప్పటికీ నాలుగు సార్లు మాట్లాడానని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సుధీర్‌రెడ్డి చెప్పారు.
వైఎస్ జగన్ ...మైసూరారెడ్డికి మర్యాద ఇవ్వకపోవడం అనేది అవాస్తవమని అన్నారు. తమ కుటుంబం అంతా చివరి వరకు వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. వైఎస్ జగన్ చేసే ప్రజా పోరాటాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ నాయకత్వం వీడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ మైసూరా రెడ్డి వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని సుధీర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.