ప్రేమలోకమిషనర్
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ప్రేమ పాఠాలు బోధిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాలకూ ఆయన ప్రేమ పాఠాలు వెళ్తున్నాయి. ప్రేమతోనే ఏదైనా సాధ్యం అని చెబుతున్న ఆయన గతంలో వివిధ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసినప్పుడే ప్రేమలో పడ్డానని... ఇంకా ఆ మైకం వదల్లేదని అంటున్నారు. అంతే కాదు.. ‘నాలాగే మీరూ ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమిస్తేనే ఎవరైనా దగ్గరకొస్తారు...’ అంటూ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో పాటు ఇత రులకూ బోధిస్తున్నారు.‘సంశయం వద్దు.. సంకోచించ వద్దు.. ఇప్పుడే రంగంలోకి దిగండి (యాక్ట్ నౌ)’ అని చెబుతున్నారు. ఈ ప్రేమ పాఠాలకు స్పందన కనిపిస్తోందని అంటున్నారు. ఇంత లేటు వయసులో ఏమిటీ ఘాటు ప్రేమ అనుకుంటున్నారా..?
..ఇంతకీ కమిషనర్ ప్రేమించాలని చెబుతున్నది ఎవరినో తెలుసా? వృత్తిని... ‘ఐ లవ్ మై జాబ్’ అంటూ ఉద్యోగాన్ని ప్రేమించాలని అందరికీ హితబోధ చేస్తున్నారు. అప్పటికీ బుర్రల్లోకి ఎక్కుతుందో లేదోనని ఏకంగా స్టిక్కర్లు అచ్చు వేయించి జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగుల టేబుళ్ల కింద అద్దాల్లో పదిలపరుస్తున్నారు. గోడలపై అంటిస్తున్నారు. పదేపదే అవి కనిపించడం వల్ల ఉద్యోగంపై ప్రేమ భావం పెరుగుతుందని... వివిధ పనులపై వచ్చే ప్రజలకు ప్రేమతో కూడిన మంచి సేవలు అందించగలుగుతారన్నది ఆయన ఉద్దేశం. గతంలో వరంగల్ జిల్లాలో కలెక్టర్‌గా పని చేసినప్పుడు మొదలైన ఈ ప్రేమ ఉద్యమం మంచి ఫలితాలివ్వడంతో తాను పని చేసే ప్రతిచోటా దీన్ని ఆచరిస్తానంటున్నారు. ‘ఐ లవ్ మై జాబ్’తో పాటు ‘యాక్ట్ నౌ, ‘సేవ్ ఎనర్జీ’, ‘మర్యాదగా మాట్లాడుకుందాం’ అనే స్టిక్కర్లను కూడా తయారు చేయించారు. జీహెచ్‌ఎంసీ అన్ని కార్యాలయాలకూ వీటిని పంపిణీ చేస్తున్నారు. అన్నీ కలపి మొత్తం ఆరువేల స్టిక్కర్లు ముద్రించారు. ప్రతి వ్యక్తీ తన ఉద్యోగాన్ని ప్రేమించినప్పుడే ఉత్తమ సేవలందించగలరని భావిస్తున్న జనార్దన్‌రెడ్డి ఈ నినాదాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల్లో సానుకూల దృక్పథం అలవరచడం... వారు తమ వద్దకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం... కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా మాట్లాడటం... అవసరం లేనప్పుడు విద్యుత్‌ను వినియోగించకపోవడం వంటివి అలవరచేందుకు జీహెచ్‌ఎంసీలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు.