'మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి' | we should defeat modi, cm kcr: sachin pilot | Sakshi
Sakshi News home page

'మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి'

Published Tue, Nov 17 2015 9:07 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి' - Sakshi

'మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి'

స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్/జనగామ: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని, నిరంకుశ పాలన సాగిస్తున్న వారి కళ్లు తెరిపించాలని కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్ అన్నారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లా జనగామలో విలేకరులతో, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ప్రచార సభలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంత ఎంపీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానే కృషి చేశారని గుర్తు చేశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూ సోనియూ తెలంగాణ ఇచ్చారన్నారు.

చిన్న రాష్ట్రంతో ప్రజల జీవితాలు బాగుంటాయని ఆశించామని, అయితే రాష్ట్రం ఏర్పాటై 18 నెలలు గడుస్తున్నా కేసీఆర్ ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని విమర్శించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని కోరారు. కేసీఆర్‌కు, మంత్రులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో 1,500 మంది రైతులు ఆత్మహత్య చే సుకుంటే.. వారి కుటుంబాలను నేటికీ కేసీఆర్ కానీ, మోదీ కానీ పరామర్శించలేదని విమర్శించారు. వరంగల్ ఉప ఎన్నిక ద్వారా బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు గుణపాఠం చెప్పాలని, ఈ ఎన్నిక దేశప్రజలకు సంకేతంగా నిలవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ప్రభుత్వ అసమర్థ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. అనంతరం ఆయనను పార్టీ నాయకులు గజమాలతో సత్కరించి, గొంగళి, గొర్రెపిల్లను బహూకరించారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు రోజీజాన్ మాట్లాడుతూ.. బీజేపీ పాలన దేశ సమైక్యతను దెబ్బతీసేలా ఉందని, మతతత్వాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు పలు హామీలిచ్చిన మోదీ వాటిని పూర్తిగా విస్మరించారని, అందుకే బిహార్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పోటీపడి నిరంకుశ పాలన సాగిస్తున్నారని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, ఓటమి భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. క్రిస్మస్ పండుగను అధికారికంగా చేస్తామని, పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చేస్తున్న ప్రకటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు మాట్లాడారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఉన్న రైతు కొమురయ్యను అతిథులు అభినందించారు. సభలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, నాయకులు గుండె విజయరామారావు, నంది ఎల్లయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.


ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాలు
బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అతి తక్కువ కాలంలో ప్రజా విశ్వాసం కోల్పోయాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్‌పైలట్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఇందులో భాగంగానే మేధావులు, కళాకారులు తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారన్నారు. సరైన విధానాలు లేకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకుపోలేకపోయారని చెప్పారు. పార్లమెంట్‌లో భూసేకరణ బిల్లును అడ్డుకొని దాన్ని చట్టం కాకుండా చేయడం ప్రజా విజయమని పేర్కొన్నారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement