జైపూర్: రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్‌పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్‌పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. పైలట్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో మోదీ పార్లమెంటులో గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసించారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. తాజాగా గెహ్లాట్‌ను ప్రశంసించారు’’ అంటూ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటాన్ని ఉద్దేశించి అన్యాపదేశంగా గెహ్లాట్ కూడా అదే చేస్తారనే అర్థంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయన్నారు.
ఆ ఎమ్మెల్యేలపై చర్యలేవీ ?
గెహ్లాట్‌తో పాటుగా ఆయన వర్గం ఎమ్మెల్యేల విషయంలో కూడా పైలెట్ అధిష్టానాన్ని నిలదీశారు. సెప్టెంబర్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరై గెహ్లాట్ మద్దతుగా బలప్రదర్శనకు వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువుందని, క్రమ శిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీకి కొత్తగా అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గేకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెహ్లాట్ పోటీలోకి దిగుతారని ప్రచారం జరిగినప్పుడు, సచిన్ పైలెట్‌ను తదుపరి సీఎంను చేస్తారని వార్తలొచ్చాయి. దీంతో గెహ్లాట్‌కు మద్దతుగా ఆయన వర్గం ఎమ్మెల్యేలు బలప్రదర్శనకు దిగిన విషయం తెలిసిందే. సీఎల్పీ సమావేశానికి గైరా>్హజరైన గెహ్లాట్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారందరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పైలెట్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకు మళ్లీ గళం విప్పారు?
సచిన్ పైలట్ ఉన్నట్టుండి గెహ్లాట్‌నిలెందుకు టార్గెట్ చేశారంటూ చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా రాజస్తాన్ రాజకీయాల్లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. నాయకులెవరూ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదన్న అధిష్టానం ఆదేశంతో గెహ్లాట్, పైలట్ వర్గీయులు మౌనం పాటిస్తున్నారు. కానీ ఇటీవల పైలట్‌పై గెహ్లాట్ పరోక్ష విసుర్లకు దిగారు. అధికారంలో కొనసాగడానికి అనుభవానికి మించినది మరేది లేదని, తమ వంతు వచ్చే వరకు సహనంతో వేచి చూడాలని చురకలంటించారు.
వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం అభ్యర్థిని తానేనంటూ అన్నింట్లోనూ తన ఫోటో బాగా కనిపించేలా చర్యలు చేపడుతున్నారు. రోడ్డు బ్యానర్లు, పత్రికల్లో ప్రకటనలు, బడ్జెట్‌కు సంబంధించిన ప్రతులు, బిల్లు బోర్డులపై గెహ్లాట్ చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అటు హైకమాండ్ కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉండడం, రాహుల్ జోడో యాత్రలో ఉండడంతో రాజస్థాన్ వ్యవహారాలను పట్టించుకునే తీరిక వారికి లేదు. ఈ నేపథ్యంలో గెహ్లాట్‌ను ప్రధాని మోదీ ఓ మాటనగానే సచిన్ తన రాజకీయ అస్త్రాలకు పదును పెట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment