
పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి
► ఆ బాధ్యత ప్రచార విభాగంపై ఉంది
► వైఎస్సార్‌సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్
గాంధీనగర్(విజయవాడ) : రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగంపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం నూతన కమిటీ సమావేశం సోమవారం జరిగింది.
ఈ సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో మిగిలిన విభాగాల కంటే ప్రచార విభాగం ఎంతో కీలకమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని ప్రలోభాలకు గురిచేస్తోందని, జగన్‌పై అసత్యప్రచారం చేస్తోందని చెప్పారు. దాన్ని సమర్థంగా ప్రచార విభాగం తిప్పికొట్టాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తోందన్నారు. ప్రభుత్వంలో నిత్యం ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార విభాగం సన్నద్ధం కావాలని కోరారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు జగన్ చేస్తున్న పోరాటాలను ప్రజలకు తెలియజేయాలని, పార్టీ విధివిధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కోరారు. అనంతరం ప్రచార విభాగం జిల్లా, నగర కమిటీ సభ్యులను అభినందించారు. ప్రచార విభాగం నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్, అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్‌మోహన్‌రాజు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, ప్రచార విభాగం నగర అధికార ప్రతినిధి తాడి శివ, కృష్ణారావు, ప్రధాన కార్యదర్శులు వెలధి అనిల్‌కుమార్, వున్నం రమేష్, శివ, సొంగా చందన్, ఆకురాతి రమాకాంత్, కేరిన్, కే శివ, కృష్ణారావు, ప్రకాశరావు, కార్యదర్శులు బషీర్ అహ్మద్, నూతలపాటి మేరీ, అయ్యప్పరెడ్డి, పాశం శివ పాల్గొన్నారు.