క్రైస్తవ ఆస్తులను కాపాడుకుందాం
– వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్
– 22న కోల్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు క్రైస్తవుల భారీ ర్యాలీ
– వివిధ రాజకీయ పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయం
కర్నూలు సీక్యాంప్: కబ్జాదారుల నుంచి కోల్స్ కళాశాల స్థలాన్ని కాపాడుకుందామని కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. తెలుగు బాప్టిస్ట్ జాయింట్ యాక‌్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ కొందరు కోల్స్ స్థలంతో పాటు ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల, రాక్‌వుడ్ చర్చి, ఈసీఎం హైస్కూల్ స్థలాలను సైతం అన్యాయంగా ఆక్రమించుకున్నారని చెప్పారు. ఈ స్థలాల పరిరక్షణకు 22న క్రైస్తవులు నిర్వహించే ర్యాలీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ జాయింట్ యాక‌్షన్ కమిటీ చైర్మన్ ప్రభుదాసు మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్న వారు లీజ్ పేరుతో క్రైస్తవ స్థలాలు కొల్లగొట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టించి అద్దెలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై తిరగబడలాని పిలుపునిచ్చారు. 22న చేపట్టే ర్యాలీకి కోల్స్ సంఘస్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో వివిధపార్టీల నాయకులు పాల్గొని తమ పూర్తి మద్దతు ప్రకటించారు