గ్రామ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం
తాడిమర్రి / ధర్మవరం అర్బన్ : గ్రామ సంపూర్ణ అభివృద్ధే తన లక్ష్యమని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ అనూరాధ పేర్కొన్నారు. తాను దత్తతకు తీసుకున్న మండలంలోని ఆత్మకూరు, శివంపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆత్మకూరు గ్రామంలో రూ.4లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం 20 మంది చేనేత కార్మికులకు ఒకొక్కక్కరికి రూ.1000లు ప్రకారం నగదు సాయం, చేనేత మగ్గం పరికరాలను అందజేశారు. అనంతరం శివంపల్లి గ్రామంలో రూ.6లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని, తాగునీటి పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికే శివంపల్లి, ఆత్మకూరు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాడిమర్రి, ఆత్మకూరు సర్పంచ్‌లు దేవర హర్షిత, సాకే లక్ష్మీదేవి, తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఎంపీడీఓ వెంకటనాయుడు, ఎస్‌ఐ రాంభూపాల్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కౌసల్య, మండల ఇంజనీర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ధర్మవరం మండలం కుణుతూరు సమీపంలో పోలీస్ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ డీజీపీ రాముడు దత్తత తీసుకున్న నార్సింపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఆయన స్ఫూర్తితో తాను తాడిమర్రి మండలంలోని శివంపల్లి గ్రామాన్ని దత్తతకు తీసుకున్నట్లు వివరించారు. గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టుశిక్షణ, అగరబత్తీ తయారీ, పురుషులకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామంలోని చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలో అక్రమ మైనింగ్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు, రూరల్ సీఐ శివరాముడు, ఎస్‌ఐలు యతీంద్ర, సురేష్ పాల్గొన్నారు.