ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తాం
ఒంటిమిట్ట:
టీటీడీకి అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, సకల వసతులు కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తలమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఒంటిమిట్లలో ఆలయం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయానికి బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్టలో రూ.4.60కోట్లతో వసతి సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఏడాదిలోగా మూడు అంతస్తుల కాటేజ్‌ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 22 గదులతో పాటు 700మంది భక్తులకు సరిపడా భోజనశాల ఉంటాయన్నారు. మరో నాలుగు డార్మెటరీల నిర్మాణానికి, అనుబంధ ఆలయాల్లో తెప్పోత్సవాలు నిర్వహించేందుకు, అన్నప్రసాద వితరణను ప్రవేశపెట్టేందుకు త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఒంటిమిట్టలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతియేటా శ్రీసీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు పుట్టా సుధాకర్‌యాదవ్, రమణ పాల్గొన్నారు.
ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులపై ఆగ్రహం
ఒంటిమిట్టలో నూతనంగా నిర్మించనున్న వసతిగృహానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను టీటీడీ అధికారులు పూర్తిగా విస్మరించారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీ పేర్లను టీటీడీ అధికారులు విస్మరించారు. దీనిపె కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులు చైర్మన్‌ను కోరారు.
కోదండరాముడిని దర్శించుకున్న చదలవాడ
కాటేజీ భూమిపూజకు ముందు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డిలు ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయంలో పూర్ణకుంభం, మేళతాళాలలో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చైర్మన్‌ను స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.