'ప్రాణమున్నంతవరకూ వైఎస్ జగన్‌తోనే'
►పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం
►కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
►జిల్లాలోని ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరు
► స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనం కోసమే కొందరు పార్టీ మారారు
► పార్టీ వీడినవారు పదవులకు రాజీనామా చేసి గెలివాలి
► ఫిరాంయిపుల చట్టంలో మార్పులు చేయాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
బొబ్బిలి: గత ఎన్నికల్లో వైఎస్ బొమ్మతో విజయం సాధించామని, ప్రాణమున్నంతవరకూ తాము వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే కలసి నడుస్తామని పార్టీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, శ్రీవాణి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, బేబినాయిన తదితరులతో కలసి వారు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోవడంతో... సీఎం చంద్రబాబు ఏపీలో వైఎస్సార్‌సీపీ విషయంలో అలా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. వివరణ తీసుకుని కూడా ఎలక్ట్రానిక్ మీడియా అసత్య ప్రచారం చేసిందని, మరోసారి అసత్య ప్రచారం చేస్తే... చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు.
టీడీపీకి చెందిన వారు తిరిగి తమ గూటికి చేరుకున్నారే తప్ప కొత్తవారెవరరూ వైఎస్సార్‌సీపీని వీడలేదన్నారు. పార్టీలు మారినప్పడు రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడుకోవాలని, ప్రస్తుతం పార్టీ ఫిరాయించినవారు అలా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలకు కాలపరిమతి లేకపోబట్టే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు.