పరాంకుశం వీణాశ్రీవాణి... ఆమె పేరులోనే సరిగమల శ్రుతి వినిపిస్తోంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శ్రుతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో సరిగమలతో అలరించింది. ఆ ఆనంద క్షణాలను ఆమె సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.
‘‘మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చు కున్నాను. ఈ రోజు ఇన్ని ప్రశంస లందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీత జ్ఞానమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి ఆహ్వానం రావడంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశమే లేదు. నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి కారణం అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చె΄్పారు అంటూ వాళ్ల మేనేజరో ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ ΄ాటలు కావాలో కూడా ఆమే ఎంపిక చేశారు. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన పది ΄ాటలను వీణ మీద వినిపించాను. నా చెలి రోజావే, ఉరికే చిలకా... వంటి పలు భాషల్లోకి అనువాదమై ఉన్న ΄ాటలనే ఎంచుకున్నాను. ఇదంతా పదిహేను రోజులపాటు నడిచింది.
రెండు కళ్లు చాలవు!
ఆడిటోరియానికి వెళ్లే దారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాత్ సంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. ఆ తర్వాత ధొలారి ధని థీమ్, ఫారెస్ట్ థీమ్, కలంకారీ థీమ్ ఓ వరుస ఉన్నాయి. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషాల్, శివమణి వంటి సంగీతకారులు, గాయకుల ప్రోగ్రామ్‌లను టీవీ లైవ్ లో చూశాను. వందమంది రాజమౌళిలు, వంద మంది సంజయ్ లీలా భన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అనిపించింది. చూడడానికి రెండు కళ్లు చాలవు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడాల్సిందే. బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్‌లో రాత్రి ఏడు నుంచి ఏడు ముప్పావు వరకు నా కచేరీ సాగింది. రాధిక మర్చంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్లు కదలకుండా కూర్చుని, ఓ పాటను మళ్లీ అడిగి మరీ చక్కగా ఆస్వాదించడం, కళల పట్ల వారికున్న గౌరవం నాకు సంతృప్తినిచ్చింది.
నాలుగు వేల అడుగులు
పన్నెండవ తేదీ ఉదయం ముంబయికి వెళ్లాం. హోటల్‌లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ సెంటర్‌కెళ్లాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియంలో వేదిక వద్దకు చేరడానికి నాలుగు వేల అడుగులు పడ్డాయి. ఫోన్‌లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వహకులు వెంట ఉండి తీసుకెళ్లకపోతే నా వేదిక ఏదో తెలుసుకోవడంతోనే రోజు పూర్తయ్యేదేమో. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళాప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనుకున్నాను. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసమే ఒక పెద్ద హాలును కేటాయించారు. వేల రకాల వంటలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్‌లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకున్నారంటే డెకరేషన్‌లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్‌కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజులపాటు ఆమె మధ్యాహ్నం మూడు నుంచి తెల్లవారి ఆరుగంటల వరకు పని చేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె.
వీణావాణి ఇచ్చిన వరం
జనసందోహంలో నేను ఎక్కువ సేపు ఇమడలేను. నా కచేరీ పూర్తి కాగానే నన్ను బయటకు తీసుకెళ్లమని నిర్వహకులను అడిగాను. గేటు వరకు తీసుకొచ్చి వెహికల్ ఎక్కించేశారు. పదమూడవ తేదీ ఉదయం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కి వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను. నాకిప్పుడు తలుచుకున్నా సరే అంతా కలలా అనిపిస్తోంది. ఆంధ్రుల ఆడపడుచుని, తెలంగాణ కోడలిని. నాకు తెలిసినంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని నేనే... అనుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తోంది. సరస్వతీ మాత వీణతోపాటు నాకిచ్చిన వరం ఈ అవకాశం అనుకుంటున్నాను’’ అని రెండు చేతులూ జోడించారు వీణాశ్రీవాణి తన వీణను మురిపెంగా చూసుకుంటూ.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment