నెల్లూరు నగరంలో మంగళవారం ఉదయం దట్టంగా కమ్ముకున్న పొగమంచు
మేఘాల్లేకపోవడమే కారణం.. కొన్నాళ్ల పాటు ఇదే వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో సరికొత్త మార్పులు సంతరించుకుంటున్నాయి. కొద్ది రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు క్షీణిస్తుండగా, పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి. ఫలితంగా పగటి వేళ ఎండ ప్రభావం, రాత్రి పూట చలితీవ్రత అధికం కానుంది. ఈ పరిస్థితికి ఆకాశంలో మేఘాలు లేకపోవడమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగనుందని వీరు పేర్కొంటున్నారు.
మరోవైపు సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, అటు తెలంగాణలోనూ 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగాను, గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగాను రికార్డవుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.