సాక్షి, మచిలీపట్నం: భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతల పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా మచిలీపట్నంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వివరాలు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల మేరకు నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ప్రస్తుతం ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వింత పరిస్థితి ఎదురవుతోంది. రాత్రిళ్లు విపరీతమైన చలి, ఉదయం 8 గంటల వరకు పొగమంచుతో కూడిన చలి ఉంటుండగా.. ఉదయం 10 గంటలు సమిపిస్తుండగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటోంది. వేడి గాలులు, వేడి తీవ్రత అధికమవుతోంది. వెరసి రాత్రిళ్లు చలికి వృద్ధులు వణుకుతుండగా.. ఉదయం ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో బట్టి చూస్తే.. జిల్లాలో వేసవి ఉపశమన చర్యలకు తక్షణం యంత్రాంగం ఉపక్రమించాల్సిన అవసం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏటా వేసవిలో వేసవిలో ఉపశమన చర్యలను కట్టుదిట్టుంగా అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. గత ఏడాది వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడటం కోసం పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది సరిగా అమలు కాలేదు. ప్రస్తుతం అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అన్ని గ్రామాలతో పాటు నగరాలు, పట్టణాల్లో ఎద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మార్చి ఒకటి నుంచి జూన్ 30 వరకు చలివేంద్రాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని చలివేంద్రాల్లో తాగునీటితో మజ్జిగ కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటే మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి తీవ్రత అధికమైన పరిస్థితిలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కడా కార్యాచరణ ప్రారంభం కాలేదు.
వెంటాడుతున్న నిర్లక్ష్యం..
వేసవిలో ప్రజలను వడగాలులు, వేడిమి నుంచి కాపాడటంలో వైద్య, ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మేరకు వైద్య బృందాలను ఏర్పాటు ఉంటుంది, వేసవిలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేపట్టవద్దన్న ఆదేశాలున్నా ఇంత వరకు కూలీలకు అమలు చేసినా దాఖలాలు లేవు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానికంగా వీరికి మజ్జిగ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు.
ప్రతి సారీ నిధుల గోల...
వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, తాగునీరు, మజ్జిగ అందజేయండి. అని ఉన్నతాధికారులు సూచిస్తున్నా మండల స్థాయిలో దీని అమలు మాత్రం అగ్యగోచరంగా మారుతోంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండల స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వీటి అమలులో వారు వెనుకంజ వేస్తున్నారు. గత ఏడాది కూడా మండలాలు, పురపాలక సంఘాలకు బాధ్యతలు అప్పజెప్పగా తూతూ మంత్రంగా నిర్వహించారు. రెండు రోజులు కేంద్రాలు పెట్టి మూడో రోజు ఎత్తేశారు.
అసలే పరీక్ష కాలం..
ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. త్వరలో పదో తరగతి, డిగ్రీ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంపై నిర్వాహకులు దృష్టి సారించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment