- మరో నలుగురికి తీవ్రగాయాలు
ప్రత్తిపాడు(తూర్పుగోదావరి)
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కలప లోడుతో రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను పెళ్లిబందం ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన కండెళ్ల రాజబ్బాయి (60) మూడో కుమార్తె గౌరి వివాహం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. వివాహ అనంతరం పెళ్లి వారంతా టాటా ఏస్ మినీ వ్యాన్‌లో స్వగ్రామానికి తిరుగుపయనమైంది. రాచపల్లి అడ్డరోడ్డు సమీపానికొచ్చేసరికి రాంగ్‌రూట్‌లో కలప లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఈ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కండెళ్ల రాజబ్బాయి, బలసా సూర్యకాంతం (55) వాహనంలోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. అంబులెన్సులో ప్రత్తిపాడు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తుండగా బలసా ధర్మరాజు (65), రాజాల రాజబాబు (బాలు) (14) మతి చెందారు.
ఈ ప్రమాదంలో గాయపడిన మేడపాడుకు చెందిన తండ్రీ కొడుకులు రాయి కాశీ, సాయి మణికంఠ, వేలంక గ్రామానికి చెందిన కండెళ్ల సన్యాసమ్మ, విజయకుమారి, నీలాంజలి, ఏడిద భూషణం, టాటా ఏస్ డ్రైవర్ బచ్చల సూరిబాబులను ప్రత్తిపాడు సీహెచ్‌సీకి.. వేమగిరి రాణి, చిక్కాల వేగులమ్మలను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చిక్కాల వేగులమ్మ మినహా మిగిలిన ఎనిమిది మందినీ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.నాగదుర్గారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.