వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు
వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు
Published Tue, Aug 30 2016 6:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
మాకవరపాలెం : వికలాంగులను వివాహాలు చేసుకునేవారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ.లక్షకు పెంచినట్టు వికలాంగశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. మాకవరపాలెం వచ్చిన ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ ప్రోత్సాహకంగా ఇప్పటవరకు రూ.50వేలు ఇచ్చేవాళ్లమన్నారు. ప్రభుత్వం ఇటీవల దీనిని రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 300 మందికి ఈ ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంకాగా ఈ ఏడాది ఇప్పటివరకు 71 మందిని ఎంపిక చేశామన్నారు. వికలాంగు లను వివాహం చేసుకున్న వారు ఈ ప్రోత్సాహకానికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అలాగే జిల్లాలో వెయ్యి వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు. పెందుర్తి, విశాఖలో వికలాంగులకు వసతి గహాలు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రస్తుతం ఖాళీలు ఉన్నాయన్నారు. ఎవరైనా చేరాలనుకుంటే దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఎండాడ వద్ద అంధ బాలికలకు రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నామని, దీనిని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాకొక వృద్ధాశ్రమం
పబ్లిక్ ప్రై వేట్ పాట్నర్‌షిప్ పద్ధతిలో ప్రభుత్వం జిల్లాకొక వృద్ధాశ్రమం ఏర్పాటుకు నిర్ణయించిందని ఏడీ తెలిపారు. దీనిలో భాగంగా మొదటగా గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఆశ్రమాలను ఏర్పాటు చేయనుందన్నారు. ఇందులో 100 మందికి ఆశ్రయం కల్పించడం లక్ష్యమన్నారు. ఈ ఆశ్రమం నిర్వహణకు వసతి, మౌలిక సదుపాయాలంతా స్వచ్ఛంధ సంస్థలే చూసుకోవాల్సింటుందన్నారు. ఈ ఆశ్రమంలో వంటలు చేసేవారు, వాచ్‌మన్, సూపర్‌వైజింగ్ చేసేందుకు అవసరమైన సిబ్బందికి వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వంద మందితో నిర్వహించే ఆశ్రమానికి ఏడాదికి రూ.46లక్షలు కర్చవుతుందన్నారు. మూడేళ్లకొకసారి వంటపాత్రలు, తదితర సామాగ్రి కొనుగోలుకు ప్రభుత్వం రూ.5.5 లక్షలు విడుదల చేస్తుందన్నారు. ఇక్కడున్న వారికి కాస్మొటిక్స్, మందులు, భోజనాలకు సంబందించి ఏడాదికి రూ.23లక్షలు అవుతాయన్నారు. ఈ నిధులు సంస్థలే చూసుకోవాలని, ఈ అవకాశం ఉన్న సంస్థలపై పరిశీలన చేస్తున్నామని, అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఆయన వెంట జూనియర్ అసిస్టెంట్ జగదీష్ ఉన్నారు.
Advertisement
Advertisement