జగిత్యాల అర్బన్ : వర్షాకాలం వచ్చిందంటే విషజ్వరాలు, డెంగీ, అతిసారం, తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా డెంగీబారిన పడిన రోగులకు రక్తకణాల సంఖ్య తగ్గి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ లక్షన్నరకు పైగా ఉంటుంది. విషజ్వరం, డెంగీజ్వరం నాలుగైదు రోజులుగా తగ్గకుండా ఉంటే ప్లేట్‌లెట్స్ వేగంగా క్షీణిస్తాయి.
ప్లేట్‌లేట్ మిషన్ ప్రారంభం ఎప్పుడో?
Published Mon, Jul 25 2016 10:52 PM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM
జగిత్యాల అర్బన్ : వర్షాకాలం వచ్చిందంటే విషజ్వరాలు, డెంగీ, అతిసారం, తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా డెంగీబారిన పడిన రోగులకు రక్తకణాల సంఖ్య తగ్గి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ లక్షన్నరకు పైగా ఉంటుంది. విషజ్వరం, డెంగీజ్వరం నాలుగైదు రోజులుగా తగ్గకుండా ఉంటే ప్లేట్‌లెట్స్ వేగంగా క్షీణిస్తాయి. ఆ సంఖ్య 50 వేలకు తగ్గినట్లయితే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్లు వైద్యులు భావిస్తారు. అలాంటి రోగులకు సాధ్యమైనంత తొందరగా ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇందుకు ప్లేట్‌లెట్స్ మిషన్ అవసరమవుతుంది. దీని ఖరీదు సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుంది. గతంలో ప్లేట్‌లెట్ మిషన్ కరీంనగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మాత్రమే ఉండేది. ఈ ప్రాంత రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది నెలల క్రితం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి ప్రభుత్వం ప్లేట్‌లెట్ మిషన్‌ను మంజూరు చేసింది. వైద్యాధికారులు ఆస్పత్రిలో స్థలం లేకున్నప్పటికీ రెండో అంతస్తులోని బ్లడ్‌బ్యాంక్ సమీపంలో ప్రత్యేక రూం ఏర్పాటు చేసి దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించి అమర్చారు. కానీ ఏం లాభం? అప్పటినుంచి ఆ మిషన్ కాస్త మూలనపడింది. మిషన్ నిర్వహణకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన నలుగురు సిబ్బంది అవసరం కాగా, ఇంతవరకు నియమించలేదు. దీంతో ఖరీదైన మిషన్ ఉండీ లేనట్లే అయ్యింది. అత్యవసర సమయాల్లో రోగులకు అపర సంజీవనిలా ఉపయోగపడుతుందనుకుంటే ఎందుకూ అక్కరకు రాకుండాపోతోంది.
రోగులకు తప్పని తిప్పలు..
అసలే వర్షాకాలం... సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో డెంగీ, విషజ్వరాలు వస్తే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతుంటాయి. సరిగ్గా ఈ సమయంలోనే రోగులకు ప్లేట్‌లెట్ మిషన్ అవసరం ఏర్పడుతుంది. జగిత్యాల డివిజన్‌లోని 14 మండలాలతోపాటు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట ప్రాంతం నుంచి నిత్యం రోగులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. ప్రతి రోజు నాలుగు వందల మంది ఔట్‌పేషెంట్లు, రెండు వందల మంది ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. వీరిలో ప్లేట్‌లెట్స్ అవసరమైన జ్వరపీడితులను కరీంనగర్ లేదా హైదరాబాద్ రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే ఒక్కసారి రక్తకణాలు ఎక్కిస్తే రూ.15వేల వరకు వసూలు చేస్తుంటారు. దీంతో రోగులకు వ్యయప్రయాసలు తప్పడంలేదు. అలంకారప్రాయంగా ఉన్న ప్లేట్‌లెట్ మిషన్‌ను ప్రారంభించాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ముందుగా కరీంనగర్‌లోని డ్రగ్ కంట్రోల్ యూనిట్ వారు మిషన్ పరిశీలించిన అనంతరం సెంట్రల్ డ్రగ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జగిత్యాల ప్రభుత్వాస్పత్రి నుంచి వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్లేట్‌లెట్ మిషన్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
వారం రోజుల్లో ప్రారంభిస్తాం
– ప్రకాశ్‌కుమార్, సూపరింటెండెంట్
వారం రోజుల్లోగా ప్లేట్‌లెట్ మిషన్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ యూనిట్ నుంచి అనుమతి రాగానే ప్రారంభిస్తాం.
Advertisement
Advertisement