రాయలసీమకు నీళ్లెప్పుడిస్తావు బాబూ
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
విజయవాడ సెంట్రల్ :
పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఎప్పుడిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమతో రాయలసీమ నీటి అవసరాలను తీరుస్తామని పదేపదే చెప్పిన చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వెల్లడించాలన్నారు. కృష్ణా– గోదావరి జలాల అనుసంధానం జరిగినట్లు చెబుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే మూడుసార్లు పట్టిసీమకు ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమ పేరు చెప్పి పబ్బం గడుపుకుందామనుకుంటే కుదరదని హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రంలో సాగునీటి రిజర్వాయర్లు ఒట్టికుండల్లా మారాయని చెప్పారు. రిజర్వాయర్ల నీటితో సాగు, తాగు అవసరాలు తీర్చుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం నేపథ్యంలో రాష్ట్రంలో జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా అక్రమ ప్రాజెక్టుల్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సూచించారు.