
లభించని కాల్వలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ
– శాలిగౌరారం అలుగు కాల్వలో కొట్టుకుపోయిన పవన్‌కుమార్
– 36 గంటలుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు
– సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే
– బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ, ఎమ్మెల్యే
– ఆర్‌డీఓ, డీఎస్పీ పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు
– వరద నియంత్రణకు గండికుంటకు జేపీబీతో రెండు చోట్ల గండ్లు
శాలిగౌరారం
శాలిగౌరారం ప్రాజెక్ట్ అలుగు కాలువలో గండికుంట వద్ద గల్లంతైన అమరగాని పవన్‌కుమార్(36) ఆచూకీ లభించలేదు. నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్ పర్యవేక్షణలో సంబంధిత సిబ్బంది 36 గంటలుగా ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. ఆదివారం రాత్రి వరకు గల్లంతైన పవన్‌కుమార్ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
శాలిగౌరారం ప్రాజెక్ట్ కుడిఅలుగు కాలువలో గండికుంట వద్ద శనివారం పవన్‌కుమార్ గల్లంతైన ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. కాలువ నీటి ఉధృతిని పరిశీలించిన అనంతరం సంఘటన జరిగిన తీరుతెన్నులపై ఆర్డీఓ, డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేసి గల్లంతైన పవన్‌కుమార్ ఆచూకీని తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలువలో వరద ఉధృతి అధికంగా ఉండటం, కంపచెట్లు ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేకు వివరించారు. పరిస్థితిని బట్టి రిస్క్యూ టీంను రప్పించి రంగంలోకి దించాలనాలని ఆదేశించారు. సంఘటన స్థలంలో బాధిత కుటుంబీకులను ఎంపీ, ఎమ్మెల్యేలు ఓదార్చారు. గాలింపు ^è ర్యలు వేగవంతం చేసి పవన్‌కుమార్ ఆచూకీ గుర్తిస్తామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
వరద నియంత్రణ కోసం కుంటకు గండ్లు
వరద ఉధృతి నియంత్రణ కోసం ప్రాజెక్ట్ అలుగు కాలువకు అనుసంధానంగా ఉన్న గండికుంటకు జేసీబీ సహాయంలో రెండు చోట్ల గండికొట్టారు. అదేవిధంగా కాలువకు వరద వెళ్లకుండా ఉండేందుకు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోవటంతో శాలిగౌరారం ప్రాజెక్ట్‌కు గండి కొట్టేందుకు అధికారులు పరిశీలన చేశారు. దీంతో ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారుల చర్యలను అడ్డుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నీటిని తోడేందుకు ఫైరింజన్ తెప్పించినా ఫలితం లేకుండా పోయింది.దీంతో పోలీసులు ప్రత్యేక బలగాలను రప్పించి గాలింపు చర్యలు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.