ఏమిటీ చెర? | Why the prison? | Sakshi
Sakshi News home page

ఏమిటీ చెర?

Published Fri, Oct 28 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

ఏమిటీ చెర?

ఏమిటీ చెర?

తెలిసో తెలియకో నేరం చేశారు.. చిన్న వయసులోనే కటకటాలపాలయ్యారు.. ఇలాంటి చిన్నారులను చేరదీసి.. సన్మార్గంలో నడిపించి..  వారికి సత్ప్రవర్తన నేర్పేందుకు ఏర్పాటుచేసినవే జువనైల్‌ హోమ్స్‌. బాల నేరస్తుల్లో మార్పుతెచ్చి వారి భవితకు బంగారుబాట వేయాల్సిన ఈ  హోమ్స్‌ లక్ష్యానికి వ్యతిరేక దిశలో పయనిస్తున్నాయి. గుంటూరులోని నెహ్రూనగర్‌ జువనైల్‌ హోమ్‌లో నలుగురు చిన్నారులు తేలిగ్గా పరారవడం.. ఈ విషయం చర్చనీయాంశం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు హోమ్‌ను గురువారం ‘సాక్షి’ పరిశీలించగా, అడుగడుగునా అనుమాన ఆనవాళ్లే కనిపించాయి.
 
గుంటూరు (పట్నంబజారు): గుంటూరులోని నెహ్రూనగర్‌ చివరన వెంకటాద్రిపేట సమీపంలో 1971లో కొత్తపేట మహిళా మండలి (కేఎంఎం) ఏర్పాటుచేశారు. 1975లో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అప్పటి నుంచి పిల్లలు వదిలేసిన వృద్ధులు, అనాథలు, ఎవరూ లేనివారు, కుటుంబాలకు దూరమైన మహిళలను చేరదీస్తూ వసతి కల్పిస్తున్నారు. మూడు నెలల కిందటే జువైనల్స్‌ సంరక్షణ బాధ్యతను కేఎంఎం తీసుకుంది. దీనిలో 30 మంది పలు నేరాలు చేసిన జువనైల్స్‌ ఉండగా, 60 నుంచి 70 మంది వరకూ ఆసరా లేని వృద్ధులు ఉన్నారు. వీరికి భద్రతగా ప్రైవేట్‌ వ్యక్తులను నియమించారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం ఈ హోమ్‌లో ఉంటున్న చిన్నారిని చూసేందుకు వచ్చిన అతని సోదరుడు యాక్సాబ్లేడును ఇచ్చి వెళ్లాడు. దానిద్వారా ఆ చిన్నారి హోమ్‌ వెనుక భాగంలోని తలుపులకు ఉన్న మూడు తాళాలను కోసి, దుప్పట్లు ఒక దానికి ఒకటి ముడివేసి రెండో అంతస్తు నుంచి కిందకు దిగి నలుగురు స్నేహితులతో పరారయ్యాడు. పరారీ అయిన చిన్నారులు.. తమ తల్లిదండ్రులను చూసొస్తామని లేఖ రాసి వెళ్లినట్లు తెలుస్తోంది.
 
సత్ప్రర్తనపై శ్రద్ధ ఏదీ..
చిన్నారుల్లో మార్పునకు తీసుకోవాల్సిన చర్యల్లో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది. యోగా సాధన, కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలేమీ తీసుకోవట్లేదు. తామే స్వయంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నా అలాంటి వాతావరణమేమీ కనిపించలేదు. 
 
నిబంధనలివీ..
  • జువనైల్‌ హోమ్‌ విశాలంగా ఉండాలి. సిబ్బంది వద్ద ఎలాంటి ఆయుధాలు ఉండకూడదు. బాల నేరస్తులను మానసికంగా, శారీరకంగా శిక్షించకూడదు. 
  • బాల నేరస్తులకు కొబ్బరి నూనె, స్నానం చేసేందుకు, బట్టలు ఉతికేందుకు తగినన్ని సబ్బులు ఇవ్వాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత హోమ్‌ నిర్వాహకులదే. ప్రతి నలుగురైదుగురికి ఒక మరుగుదొడ్డి ఉండాలి. 
  •  బాల నేరస్తులు ఆడుకునేందుకు ఇండోర్‌ పరికరాలు ఉండాలి. వారిలో నేరప్రవృత్తి  తగ్గించే కార్యక్రమాలను పరిశీలనా గృహంలో నిర్వహించాలి. టీవీలను ఏర్పాటు చేయవచ్చు. 
  • బాల నేరస్తులకు ఉదయం టిఫిన్, పాలు, మధ్యాహ్నం, రాత్రి  భోజనం పెట్టాలి. వారానికి ఒకరోజు మాంసాహారం, ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి కోడిగుడ్డు ఇవ్వాలి. బంధువులు కేటాయించిన సమయంలో మాత్రమే కలవాలి.
కారణమేంటి?
భద్రతా సిబ్బంది ప్రైవేట్‌ వారైనా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలి. సెక్యూరిటీ నిమిత్తం సిబ్బంది ఉన్నారని చెబుతున్నా గేటు వద్ద వాచ్‌మెన్‌ కూడా కనిపించలేదు. సిబ్బంది మొద్దునిద్రలో ఉండటం వల్లే తాళాలు కోస్తున్నా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. అయితే, యాక్సాబ్లేడు ఇచ్చిన సమయం రాత్రి 7 గంటలు కావడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నిర్వాహకులు ఇప్పటివరకు న్యాయస్థానానికి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. పరారీ అయిన జువనైల్స్‌ మంగళగిరి పోలీసులకు చిక్కారని తెలుస్తోంది. 
 
అత్యవసరమైతే అంతే..
జువనైల్‌ హోమ్‌లో ఉండే చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కాలపరిమితి లేని మందులనే మెడికల్‌ రూమ్‌లో ఉంచడం ఇందుకు నిదర్శనం. సెలైన్‌లు, ఎలక్ట్రాల్‌ పౌడర్, ఇంజ క్షన్‌లో కలిపే వాటర్‌ ప్యాకెట్లు కాల పరిమితి చెల్లినవి. వీటిని ‘సాక్షి’ గమనిస్తుండగా, నిర్వాహకులు వాటిని బల వంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. అత్యవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లే వాహనం కూడా ఇక్కడ అందుబాటులో లేదు. నొప్పులు, జ్వరం వస్తే వినియోగించే యాంటిబయోటిక్‌ మందులే తప్ప వేరే ఏమీ లేవు. నిర్వాహకులు చెబుతున్న ఏఎన్‌ఎం విధులకు రాలేదు. ఆరోగ్యం బాగోలేక రాలేదని నిర్వాహకులు బుకాయిస్తున్నట్లు చిన్నారులు చెబుతున్నారు. మందుల గది స్టోర్‌రూమ్‌ను తలపించేలా ఉంది.
 
బిడ్డల్లా చూస్తాం..
కేఎంఎంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కన్నబిడ్డల్లా చూస్తాం. అయితే, సెక్యూరిటీ తప్పిదం వల్లే చిన్నారులు పరారయ్యారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాం.
– పి.రాజ్యలక్ష్మి, నిర్వాహకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement