ఆత్మహత్య చేసుకున్న నేత్రావతి
- పరస్త్రీ వ్యామోహంలో భర్త
- తనను, బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న మనస్తాపం
- జీవితంపై విరక్తితో బిడ్డలకు ఉరేసి, తానూ బలవన్మరణానికి పాల్పడిన అభాగ్యురాలు
- ఇదే విషయమై నాలుగేళ్ల కిందటా ఆత్మహత్యాయత్నం
బిడ్డల మీద ప్రేమకంటే భర్తపై కోపమే ఆమెకు ఎక్కువైంది.. పిల్లల మీద ఆశైనా ఆమె ఆవేశాన్ని అణచలేకపోయింది. ముద్దులొలికే బిడ్డలను చంపడానికి ముందు మొద్దుబారిన ఆ మనసు ఎంత ఏడ్చిందో.. సర్వస్వమనుకున్న భర్తే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.. భర్తను ప్రశ్నించింది.. నిలదీసింది.. అయినా ఆ కామాంధుడిలో మార్పు రాలేదు. ఇక తను బతికి ప్రయోజనం లేదనుకుందో, ఏమో ఆ పిచ్చితల్లి.. తాను చస్తే బిడ్డల ఆలనాపాలనా ఎవరు చూస్తారనుకుందో ఏమో... తొలుత బంగారం లాంటి పిల్లలిద్దరినీ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. వారి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక.. తానూ ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన గుత్తిలో మంగళవారం చోటుచేసుకుంది.
గుత్తి(అనంతపురం) : గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు.
వివాహేతర సంబంధం వద్దన్నా...
హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. ఈ విషయాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు.
మొదట పిల్లలకు ఉరేసి..
నేత్రావతి ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చీరలను వేలాడదీసి వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు. అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు. మురారి గుత్తి ఆర్‌ఎస్‌లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నారు.
పోలీసులకు తప్పుడు ఫిర్యాదు
కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతుండేదని, అందుకు తాను అంగీకరించకపోవడం తో ఇలా చేసుకుం దని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.