సాక్షి, బెంగళూరు : ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబంలో విషాదం తాండవించింది. ఆయన లేని జీవితం తమకు వద్దని భార్యాపిల్లలు ఘోర నిర్ణయం తీసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లీ, కొడుకు, కూతురు నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ వద్ద జరిగింది. మృతులను మైసూరు పీఎస్ నగరకు చెందిన కవితా మందణ్ణ(57), కౌశిక్(29), కల్పిత (27)గా గుర్తించారు. వివరాలు... కవితా మందణ్ణ స్వస్థలం కొడగు జిల్లా విరాజపేట. ఆమె భర్త కిషన్(65)తో కలిసి మైసూరులో స్థిరపడ్డారు. కిషన్ వ్యవసాయం, వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన కిషన్.. శనివారం మధ్యాహ్నం మరణించారన్న సమాచారం అందింది. భర్త మరణవార్తను తట్టుకోలేని కవితతో పాటు ఆ దంపతుల కొడుకు, కూతురు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు అంతా కలసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కవిత, ఆమె పిల్లలు లేఖ రాసి బంధువుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. తరువాత కారులో బంట్వాళకు చేరుకుని.. పెనెమంగళూరు వద్ద నేత్రావతి నది వంతెన వద్ద కారును నిలిపారు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు తమ పెంపుడు కుక్కను నీటిలోకి తోసివేశారు. అనంతరం ముగ్గురూ ఒకేసారి నదిలోకి దూకేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కవితను నీటిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందింది. కౌశిక్, కల్పితల ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. కాగా వాట్సాప్‌లో కిషన్ కుటుంబం లేఖను చూసిన వారి బంధువులు.. మైసూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి చూడగా సూసైడ్ నోట్ లభించింది. ఈ నేపథ్యంలో ముగ్గురి మొబైల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా.. వారు బంట్వాళలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే వారు నదిలోకి దూకేశారు.
Comments
Please login to add a commentAdd a comment