భార్యలేని లోకంలో ఉండలేక.. | wife died.. husband suiside | Sakshi
Sakshi News home page

భార్యలేని లోకంలో ఉండలేక..

Published Mon, Aug 8 2016 12:43 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

భార్యలేని లోకంలో ఉండలేక.. - Sakshi

భార్యలేని లోకంలో ఉండలేక..

– ఈ నెల 3వతేదీన స్కూటీపై వెళ్తూ భార్య మృతి
– మనోవేదనతో భర్త ఆత్మహత్య 
 
కర్నూలు: 
ఐదురోజుల క్రితం భార్య, ఇప్పుడు భర్త తమ చిన్నారి కూతురును ఒంటరి చేసి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చారు. ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డు వెనుక ఉన్న రెవెన్యూ కాలనీలో చోటుచేసుకుంది. షేక్‌షబ్బీర్‌నాయక్‌ (40) ఆదివారం ఉదయం ఆనంద్‌ థియేటర్‌ సమీపంలోని వంతెనపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిస్టర్స్‌ స్టాన్సిలాస్‌ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల కూతురు షేక్‌సాదియాను స్కూటీపై ఇంటికి తీసుకొస్తుండగా ఈ నెల 3వతేదీన పంప్‌హౌస్‌ దగ్గర డీసీఎం వాహనం ఢీకొనడంతో భార్య గౌషియాబేగం మరణించింది. ఆదివారం ఐదవదినం చేసేందుకు బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. భార్య మృతి చెందిన రోజు నుంచి శోకసంద్రంలో ఉన్న షబ్బీర్‌నాయక్‌ ఒక్కసారిగా బంధువులను చూసి మనోవేదనకు గురయ్యాడు. 11 గంటల సమయంలో టీ తాగివస్తానంటూ రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో ఆయన కాలు, చేయి చిధ్రమైపోయాయి. స్థానిక ఇందిరాగాంధీ నగర్‌ వాసుల సమాచారం మేరకు రైల్వే ఎస్‌ఐ జగన్‌ అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
ఒంటరిదైన చిన్నారి.. 
షేక్‌షబ్బీర్‌నాయక్‌ మార్కెట్‌యార్డు వెనుక కూల్‌డ్రింక్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంతానం లేనందునా నాలుగేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. ఆ పాపను స్కూలు నుంచి ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో భార్య మతి చెందింది. ఇప్పుడు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చిన్నారి ఒంటరిగా మిగిలింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement