ఏడాదిలోగా ఉద్యానశాఖలో ప్రగతి సాధిస్తాం
-
రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి
పొదలకూరు : ఏడాదిలోగా ఉద్యానశాఖలో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుతామని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి పేర్కొన్నారు. పొదలకూరులోని నిమ్మమార్కెట్ యార్డును కమిషనర్ ఆదివారం పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల సాగు పెంచేందుకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లాలో 30 మంది ఎంపీఈఓల నియామకం జరిగినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానపంటల పురోగతి 18 శాతం నుంచి 20 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరువు మండలాల్లో ఉద్యానశాఖ ద్వారా రైతులకు సహకారం ఇవ్వలేమన్నారు. అయితే ఉద్యోగుల ద్వారా ఎన్యుమరేషన్ నిర్వహించి కేంద్రాన్ని నివేదిక సమర్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని తీసుకువస్తామన్నారు.
‘ఈ–నామ్’ వల్ల ఇబ్బందులు
నిమ్మమార్కెట్ యార్డులో ఈ–నామ్ వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని వ్యాపారులు ఉద్యానశాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కాయలను నిల్వ చేయలేమని ఇందువల్ల నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట జిల్లా ఏడీహెచ్ ఉమాదేవి, ఏపీడీ వై.గోపీచంద్, హెచ్‌ఓ హేమలత, ఏపీఎంఐ ఏఓ నరసింహులు ఉన్నారు.