
రేపట్నుంచి ఆఫీసులకు తాళాలు
ఎమ్మార్వోపై దాడి కేసులో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను, ఆయన అనుచరులను శుక్రవారం ఉదయం 10 గంటలకల్లా అరెస్టు చేయకపోతే.. రేపటి నుంచి రెవెన్యూ ఆఫీసులకు తాళాలు వేసి ధర్నా చేస్తామని కృష్ణా జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. అలాగే ఘటనా స్థలంలో ప్రేక్షక పాత్ర వహించిన ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని సంఘం డిమాండ్ చేసింది.
ప్రజాప్రతినిధులే దాడికి పాల్పడితే తాము ఇంక ఎవరికి చెప్పుకోవాలని సంఘ నేతలు అన్నారు. ఇంత దాడి చేసి, పైపెచ్చు తమ ఎమ్మార్వో మీదనే తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. తమకు రక్షణ కల్పించేవరకు ఇసుక అమ్మకాలకు సంబంధించిన డ్యూటీలు చేయలేమని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 64 రెవెన్యూ సంఘాలతో కలిపి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేశారని ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రభాకర్పై ఇప్పటికే 36 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభాకర్ కేవలం ఇసుక అక్రమ రవాణా మీదే ఆధారపడి బతుకుతున్నాడని ఆరోపించారు. ఏలూరులో రౌడీషీట్ ఉన్న చింతమనేనిని తక్షణమే ప్రభుత్వ విప్ పదవి నుంచి తొలగించాలని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసి, తిరిగి తమ అధికారులపైనే కేసు పెట్టడం దారుణమని, చేతగానివాడిలా చూస్తూ ఊరుకున్న ఎస్ఐని విధుల నుంచి తప్పించాలని అన్నారు.