తహసిల్దార్ వనజాక్షిదే తప్పన్న ఏపీ కేబినెట్ | ap cabinet blames mro vanajakshi in attack incident | Sakshi
Sakshi News home page

తహసిల్దార్ వనజాక్షిదే తప్పన్న ఏపీ కేబినెట్

Published Thu, Jul 23 2015 12:57 AM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

తహసిల్దార్ వనజాక్షిదే తప్పన్న ఏపీ కేబినెట్ - Sakshi

తహసిల్దార్ వనజాక్షిదే తప్పన్న ఏపీ కేబినెట్

తహసీల్దార్ వనజాక్షిపై తేల్చేసిన మంత్రివర్గం..
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్‌కు మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయించింది. ఇసుక అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దారు వనజాక్షిపై చింతమనేని దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చెప్పిన సీఎం ఆ విచారణ ఏదీ జరక్కుండానే బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తప్పంతా అధికారిదేనని తేల్చినట్టు విశ్వసనీయ సమాచారం.

మహిళా అధికారి వనజాక్షి తన పరిధి దాటి వ్యవహరించారని మంత్రివర్గం నిర్ణయానికి వచ్చింది.సమావేశంలో పాల్గొన్న మంత్రులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంత్రివర్గ సమావేశంలో ఎమ్మార్వో వనజాక్షి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న వ్యవహారంపైనా చర్చించారు.

ఈ సందర్భంగా తప్పంతా వనజాక్షిది అని తేల్చారు. ఆమె కృష్ణా జిల్లా సరిహద్దులు దాటి పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లి ఇసుక రవాణాను అడ్డుకున్నారని, పశ్చిమగోదావరి జిల్లావాసులు తరలిస్తున్న ఇసుకకు అవసరమైన రశీదులున్నాయని మంత్రివర్గ సమావేశంలో తేల్చారు. ఆమె పక్క జిల్లాకు వెళ్లి ఇసుక రవాణాను అడ్డుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
 
కేబినెట్‌లో చర్చపై విస్మయం
అధికారిణి వనజాక్షిపై దాడి జరిగిన తర్వాత ఉద్యోగ, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో సంఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. విచారణ అధికారిని నియమించడాన్ని పక్కనబెట్టి దాడిపై కేబినెట్‌లో చర్చించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను కాపాడుకోవడానికి సాక్షాత్తు మంత్రిమండలిని వేదికగా చేసుకోవడంపైనా పలువురు ఉన్నతాధికారులు విస్మయం చెందారు.
 
తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో విచారణ
పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. దీనిపై  న్యాయ విచారణకు సీఎం అప్పుడే ఆదేశించారు. సిట్టింగ్ జడ్జితో కాకుండా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం.
 
సీడ్ కేపిటల్ ప్రణాళికకు ఆమోదం
సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్ కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తొలి దశ రాజధాని నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేయాలని, జపాన్, సింగపూర్ దేశాలను నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని, స్విస్ చాలె ంజ్ పద్ధతిలో వాటిని రాజధాని నిర్మాణంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించాలని నిర్ణయించారు.
 
‘తొక్కిసలాట’పై కొత్త పల్లవి..!
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: రాజమండ్రి పుష్కరఘాట్ తొక్కిసలాట ఘటనకు మసిపూసి మారేడుకాయ చేసే కుట్ర జరుగుతోంది. అధికారులతోపాటు చంద్ర బాబు ఈ అపకీర్తి నుంచి బయటపడేందుకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందనే పుకార్లు రావడంతో భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీశారని, ఆ క్రమంలోనే పుష్కరఘాట్ ఘటన జరిగిందనే వాదనను  తెరపైకి తెస్తున్నారు. రాజమండ్రిలో కేబినెట్ భేటీ అనంతరం వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు పాత్రికేయుల వద్ద ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఇకపై ప్రతి వారం కేబినెట్: గంటా
వీఐపీ ఘాట్ (రాజమండ్రి): పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇకపై ప్రతి వారం విధిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తుందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. తద్వారా ఆ వారంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకు, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో బుధవారం ఆయన పుష్కర స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పది రోజులుగా సీఎం చంద్రబాబు రాజమండ్రిలోనే ఉన్నందున ఈ వారం సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సింగపూర్‌లో కూడా ప్రతి వారం కేబినెట్ సమావేశం నిర్వహించి, పాలనపై సమీక్షిస్తారని పేర్కొన్నారు.
 
ఇన్‌పుట్ సబ్సిడీలో రూ.375 కోట్ల కోత  
* రూ.692.67 కోట్లకే పరిమితం చేసిన కేబినెట్

సాక్షి, హైదరాబాద్: కరవు బారిన పడిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. 2013 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు రూ.2,173.61 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ)ని ఎగ్గొట్టిన సర్కారు..  2014 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీలోనూ రూ.375.1 కోట్లను కోత వేసింది. ఇందులో రూ.289 కోట్లు దుర్భిక్ష జిల్లా అనంతపురం రైతులకు చెల్లించాల్సిన మొత్తమే కావడం గమనార్హం.
 
శస్త్ర చికిత్స వల్లే వెళ్లలేదు: కేఈ
మోకాలి శస్త్ర చికిత్స కారణంగానే రాజమండ్రిలో జరిగిన మంత్రివ ర్గ సమావేశానికి తాను హాజరు కాలే దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నానన్నారు. శస్త్ర చికిత్స విషయాన్ని సీఎంకు ముందుగానే తెలిపానన్నారు. అందువల్లే పుష్కరాలకు కూడా హాజరు కాలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement