ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల పక్షమే!
- జేఏసీ ప్రజలకు మేలు చేసే సంస్థ.. అభివృద్ధి తప్ప మాకు ఇంకేం అక్కర్లేదు
- నాకు ఇంకా పావలా జీవితమే మిగిలింది.. అది తెలంగాణకే..
- సింగరేణి ఓపెన్‌కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
- నేడు టీజేఏసీ భేటీలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం
- సమస్యల పరిష్కారానికి ప్రతి మండలంలో సబ్ కమిటీల ఏర్పాటు
సాక్షి, మంచిర్యాల: ‘‘ఇప్పటికే మూడొంతుల జీవితం గడచిపోయింది. పావలా జీవితమే మిగిలి ఉంది. దాన్నీ తెలంగాణ కోసమే కేటాయిస్తా. నేను ఎవరో ప్రేరేపిస్తే.. ప్రేరేపించబడేవాడిని కాను. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల పక్షానే ఉంటాం. వారి కోసమే పోరాడతాం. తెలంగాణ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదు..’’ అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ‘రెండేళ్ల తెలంగాణ-ప్రజల ఆకాంక్షలు-ప్రభుత్వ పనితీరు’పై టీజేఏసీ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
టీజేఏసీ రాజకీయ సంస్థ కాదని.. ప్రజలకు మేలు చేసే సంస్థ అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి తప్ప తమకెలాంటి కోరికలు లేవని చెప్పారు. తెలంగాణ కోసం రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపై తీసుకొచ్చింది జేఏసీయేనని పేర్కొన్నారు. కోదండరాం వెనక తెలంగాణ వ్యతిరేక శక్తులున్నాయంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా.. తన వ్యాఖ్యల వెనక ఎవరి ప్రమేయం లేదని స్పష్టంచేశారు.
‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు సింగరేణి ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ వ చ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. ఓపెన్‌కాస్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడతాం. బుధవారం హైదరాబాద్‌లో టీజేఏసీ సమావేశం నిర్వహించి అందులో అందరితో చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల స్థాపన సమస్యలు ఉన్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో త్వరలోనే మండలాల వారీగా సబ్ కమిటీలు, రైతు జేఏసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆయా కమిటీలు స్థానిక సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చే సి నివేదికలివ్వాలి. జూలైలోపు కమిటీలు రౌండ్ టేబుల్ సమావేశం పూర్తి చేస్తాయి’’ అని కోదండరాం వివరించారు.