ప్రకృతి వ్యవసాయంతోనే మంచి ఆహారం | with natural agriculter good food | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతోనే మంచి ఆహారం

Published Tue, Jan 31 2017 10:06 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

ప్రకృతి వ్యవసాయంతోనే మంచి ఆహారం

ప్రకృతి వ్యవసాయంతోనే మంచి ఆహారం

 తణుకు టౌన్‌ : ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలకు బదులుగా కషాయాలతో కీటకాలను నిర్మూలించడం ద్వారా మంచి ఆహార పదార్థాలను అందించవచ్చని గుంటూరు రైతునేస్తం ఫౌండేషన్‌ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల లైఫ్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రధాన భూమిక కలిగి ఉంటుందని, ఒక ఆవుతో ఐదు ఎకరాలను సాగు చేయవచ్చన్నారు. ఈ విధానంలో ఎకరానికి 65 నుంచి 70 బస్తాల ధాన్యాన్ని పండించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రోజూ రైతు పంటను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ విధానంలో పండించిన పంటను కూడా రైతే స్వయంగా మార్కెటింగ్‌ చేసుకోవడం ద్వారా లాభాలను పొందవచ్చని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో పండిన పంటలను కొనుగోలు చేసేందుకు ఇటీవల విజయవాడలో ఒక సొసైటీ ఏర్పాటు చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో తమ ఫౌండేషన్‌ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఆదివారం రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల భూములు సారాన్ని కోల్పోయాయన్నారు. వాటిని మళ్లీ వృద్ధి చేసేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వారు పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు. మదనపల్లి ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలన్నారు. నువ్వులు, బెల్లం, వేరుశనగ, జొన్నలు, సజ్జలు ఎక్కువ ఆహారంగా తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతు భూపతిరాజు రామకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలోని నాచుగుంటలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరానికి సంవత్సరానికి రూ.72,500 లాభం  ఆర్జిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 110 మంది రైతులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.అరుణ, ఏవో డాక్టర్‌ డాక్టర్‌ డి.సుబ్బారావు, కళాశాల కమిటీ సభ్యురాలు చిట్టూరి సత్య ఉషారాణి, ప్రిన్సిపాల్‌ ఎం.రాజేంద్రప్రసాద్, వీవీవీ సత్యనారాయణరెడ్డి, బి.నాగపద్మావతి, కె. రాధాపుష్పావతి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement