వీఆర్ టెక్నాలజీతో 3 నిమిషాల్లో దర్శనం
తిరుపతి ఎడ్యుకేషన్: వర్చువల్ రియాలటీ (వీఆర్) టెక్నాలజీతో కేవలం మూడు నిమిషాల్లోనే శ్రీవారిని దర్శించుకున్న అనుభూతిని పొందవచ్చని ఇమేజినేట్ సంస్థ ఎండి హేమంత్ సత్యనారాయణ తెలిపారు. ఇస్కా మీడియా సెంటర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన శాస్త్ర సాంకేతిక సదస్సును ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నిర్వహిస్తున్నందున ప్రభుత్వం తమను సంప్రదించిందన్నారు.
తిరుమలకు అందరూ కాలి నడకన వెళ్లరని, అలాంటి వారికి కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనుభూతి కలిగేలా యాప్‌ను రూపొందించాలని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. దీనికోసం అలిపిరి తొలిమెట్టు, నడకదారిలోని తొలి గోపురం, గాలి గోపురం, మోకాలి పర్వతం, తిరుమల ప్రవేశమార్గం, శ్రీవారి ఆలయం ముందు వరకు నాలుగు కెమెరాల ద్వారా చిత్రీకరించి శ్రీవారిని దర్శించుకునే అనుభూతిని కల్పించేలా ఈ యాప్‌ను రూపొందించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధి కుమార్ పాల్గొన్నారు.