నోటీసులు ఇవ్వకుండానే అపరాధరుసుములా?
ఇంటిపన్నుల విధానంలో మార్పులు చేయాలి
కోదాడఅర్బన్: కోదాడ మున్సిపాలిటీలో ఇంటిపన్నుల విధానంలో మార్పులు చే స్తామని గతంలో ఇచ్చిన హామీని మున్సిపల్ అధికారులు వెంటనే అమలు చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడిమర్రి సత్యబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటిపన్నుల పెంపుపై గతంలో ఆందోళనలు చేసినప్పుడు ఇచ్చిన రివిజన్ పిటిషన్లను 45రోజులలోగా మళ్లీ కొలతలు వేసి పన్ను వేయాల్సి ఉండగా అది జరగలేదన్నారు. పట్టణాన్ని జోన్స్, సబ్ జోన్స్‌గా వేరు చేయాలని ప్రభుత్వ నిబంధనలలో ఉన్నా దానిని అమలు చేయకుండా అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు. దీనివల్ల ప్రస్తుతం స్లమ్ ఏరియాలలోని ప్రజలు కూడా అధికంగా పన్ను చెల్లించాల్సి వస్తున్నదన్నారు. ఆగస్టు నెలలో ప్రస్తుత సంవత్సర పన్ను నోటీసులు ఇస్తూ దానికి జూన్ నుంచి అపరాధరుసుము కట్టాలనడం దారుణమన్నారు. రివిజన్ కోరిన వారికి దరఖాస్తులను పరిష్కరించాలని, పట్టణాన్ని రీజోన్స్ చేసి పన్ను విధించాలని, ఇంటిపన్నుపై అపరాధరుసుమును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్, కౌన్సిలర్లు వాడపల్లి వెంకటేశ్వర్లు, కొమరగిరి రంగారావు, నాయకులు షమి, ముస్తఫా, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు గంధం బంగారు, పొడుగు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.