టాప్ కార్ డీలర్లకు కేంద్రం షాక్!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నల్లధన కుబేరులకు, అక్రమార్కులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసిన కార్ల సంస్థలకు, వినియోగదారులకు ప్రభుత్వం షాకిచ్చింది. నవంబర్ 8 తర్వాత దేశంలో ఎన్నికార్లు అమ్ముడయ్యాయనే వివరాలను సంబంధిత డీలర్ల నుంచి ఆరా తీస్తోంది. నవంబర్ 8న తర్వాత కారుకొన్న వారికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా పలుచోట్ల విస్తృత సోదాలు జరిపిన ఐటీశాఖ తాజాగా కార్ల అమ్మకాలపై దృష్టిసారించింది. రూ 500, రూ.1000 నోట్ల ఉపసంహరణ తరువాత జరిపిన కార్ల విక్రయాలపై వివరాలను ఇవ్వాలని కోరుతూ దేశంలోని టాప్ కార్ల సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కేవలం లగ్జరీ కార్ల కొనుగోలుదారులను మాత్రమే కాకుండా ఎవరు ఇంటికి కొత్త కారు తీసుకెళ్లినా కూడా వారి వివరాలను కోరింది. వీరికి జనవరి 1 -15 తేదీల మధ్య నోటీసులు జారీచేయనుంది. తాజా ఆదేశాల మేరకు ఇప్పటికే కొంతమంది డీలర్స్ సంబంధిత డాటాను ఐటీ శాఖకు ససమర్పించినట్టు సమాచారం.
తమకు ఐటీ అధికారుల నుంచి నోటీసులు అందినట్టుగా కొంతమంది కార్ డీలర్స్ అంగీకరించారు. వంబర్ 8తర్వాత కార్లు కొనేవాళ్లు తేదీలు మార్చి కొంటారేమోననే అనుమానం ఐటీశాఖ అధికారుల్లో ఉందని, అందుకే పాత తేదీలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 8కి ముందు కార్ల కొనుగోళ్లకు సంబంధించిన ఎంట్రీలను కూడా సమర్పించాల్సి వస్తోందని తెలిపారు. అటు ఆదాయ పన్ను అధికారులు కూడా దేశవ్యాప్తంగా కార్ డీలర్లకు నోటీసులు పంపినట్టు ధృవీకరించారు. నవంబరు నెలలో అధికంగా నమోదైన కార్ల అమ్మకాలు, బ్యాంకు డిపాజిట్ల ఆధారంగా ఈ నోటీసులిచ్చినట్టు తెలిపారు. ఎంట్రీ పుస్తకాల్లో పాత తేదీలను కూడా తనిఖీ చేయాలని వారు భావిస్తున్నట్టు చెప్పారు.