పుల్‌కల్ (మెదక్) : తల్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా సమీపంలోనే ఉన్న ఆమె కుమార్తె తృటిలో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం ముద్దాయిపేటలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం సిర్పురం గ్రామానికి చెందిన అంజయ్య కూతురు అంజలి(24)కి ముద్దాయిపేట గ్రామానికి చెందిన తాడ్‌మన్నూర్ గోపాల్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు మైత్రి(ఏడాదిన్నర) ఉంది. ఇటీవల ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజలి తనతో పాటు కూతురిని ఇంట్లోనే ఉంచి తలుపు గడియపెట్టింది. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తల్లి మంటల్లో కాలుతుండగా చిన్నారి భయంతో బిగ్గరగా ఏడ్చింది. అప్రమత్తమైన చుట్టుపక్కలవారు తలుపులు పగులగొట్టి మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడిన అంజలిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. చిన్నారి తలకు, చేతికి కాలిన గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.