
సుజాత(ఫైల్)
కట్నం వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య ఘటన పంజగుట్ట ఠాణా పరిధిలో జరిగింది.
పంజగుట్ట: కట్నం వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం... ఎల్లారెడ్డిగూడ పద్మావతి ప్లాజాలో నివాసం ఉండే సారయ్య, సాలీలకు కుమారులు వీరన్న, రాములు సంతానం. వీరిద్దరూ మహేశ్వరం మండలానికి చెందిన స్వరూప, సుశీల (24) అక్కాచెల్లెళ్లను 2009 మార్చి 21న పెళ్లి చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చి.. ఘనంగా పెళ్లి చేశారు. సుశీలకు ఆడ పిల్ల పుట్టగానే భర్త రాములు వేధింపులు మొదలెట్టాడు. అదనపు కట్నం తెమ్మని చితకబాదేవాడు.
దీంతో సుశీల కుటుంబ సభ్యులు ఇద్దరూ అన్నదమ్ములకు అదనపు కట్నం కింద చెరో అర ఎకరం రాసి ఇచ్చారు. అయినా తృప్తి చెందని రాములు వేధించి, చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన సుశీల మంగళవారం ఉదయం కుమార్తె భవిష్య (6)ను పాఠశాలకు పంపించి తలుపు గడియ పెట్టుకుంది. సాయంత్రం వరకు గదిలోంచి బయటకు రాకపోవడంతో సుశీల సోదరి స్వరూప, ఆమె భర్త వీరన్న కలిసి గడియ విరగొట్టి చూడగా సుశీల ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉంది. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరి స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రాములు, అత్తామామలతో పాటు బావ వీరన్నపై కేసు నమోదు చేశారు.
మంత్రి బెదిరిస్తున్నారు: బాధితుల ఆరోపణ
సుశీల మృతికి కారణమైన భర్త, అత్తామామలతో పాటు బావను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఓ మంత్రి తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, విత్‌డ్రా చేసుకోకపోతే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కేసు మాఫీ చేయిస్తామని అంటున్నారని మృతురాలి బంధువులు కంటతడిపెట్టారు. నిందితులు కూడా సదరు మంత్రి ఇంట్లోనే తలదాచుకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనే వీరన్న, రాములుకు వేరేవారితో పెళ్లిళ్లు అయినట్టు తమకు సమాచారం అందిందని బాధితులు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.