
తల్లిదండ్రులే కానిపని చేయమన్నారని..
తణుకు(పశ్చిమగోదావరి) : కన్న తల్లిదండ్రులే కానిపని చేయమన్నారని ఓ వనిత ఆత్మహత్య చేసుకుంది. నా చావుతోనైనా వారికి శిక్ష పడాలి. నా తల్లిదండ్రులే నన్ను వ్యభిచారం చేయమంటున్నారు. ఒప్పుకోకపోవడంతో నా భర్తపై అన్యాయంగా అదనపు కట్నం కేసు బనాయించారు. ఈ పరిస్థితుల్లో నేను బతికి ఉండలేను. చావే నాకు శరణ్యం. నా చావుకు నా తల్లిదండ్రులు, తమ్ముడితోపాటు గుడాల సాయిశ్రీనివాస్ అనే వ్యక్తి కారణం. నా చావుతోనైనా వారికి శిక్ష పడాలి’ అంటూ ఒక యువతి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సెల్‌ఫోన్‌లో 2 నిమిషాల 30 సెకన్ల వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన వెల్దుర్తి కృపామణి (25), అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్ ఐదేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందు నుంచీ ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులతోపాటు తమ్ముడు ఆమెను వ్యభిచార రొంపిలోకి దించే ప్రయత్నం చేశారు. అయితే కృపామణి పెళ్లి తర్వాత భర్తతో వేరు కాపురం పెట్టుకుని జీవిస్తోంది. ఈ క్రమంలోనూ కృపామణితో వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకు వచ్చారు.
ఒకానొక సమయంలో భర్తతో ఘర్షణపడి కొన్ని రోజుల పాటు తల్లి దగ్గరకు వెళ్లింది. ఈ సమయంలో కృపామణిని ఒక గదిలో బంధించి గుడాల శ్రీనివాస్ అనే వ్యక్తితో బలవంతంగా వ్యభిచారం చేయించాడు. ఈ సమయంలో శ్రీనివాస్ ఆమెను కొట్టి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను లొంగదీసుకున్నాడు.
నెల తర్వాత మరోసారి తనతో రావాలని లేకపోతే ఫొటోలు, వీడియోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన కృపామణి మంగళవారం వేకువజామున కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి కృపామణి ఆచూకీ కోసం వెదుకుతున్న కుటుంబ సభ్యులకు పాలకోడేరు సమీపంలో కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌తోపాటు తన చావుకు గల కారణాలను వివరిస్తూ తీసిన సెల్ ఫోన్ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై జి.కాళీచరణ్ మాట్లాడుతూ కృపామణి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆమె మృతదేహం పాలకోడేరు సమీపంలో బుధవారం లభ్యమైనందున అక్కడి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.