మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని...
నకిరేకల్ : ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఓగోడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన అక్కనపల్లి పిచ్చయ్య-సోమక్క దంపతులకు నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన అక్కనపల్లి పద్మ (23) గత రెండు సంవత్సరాల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. మొదటి పోస్టింగ్ కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌కు కెటాయించారు.
అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె స్వగ్రామమైన ఓగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పద్మ ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. అయితే ఏమైందో ఏమోకాని సదరు యువకుడు నాలుగు రోజుల క్రితం మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన పద్మ ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలో పడి ఆమెను కుటుంబ సభ్యులు నకిరేకల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మృతురాలి తండ్రి పిచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అనంతరం పద్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. గ్రామంలో జరిగిన పద్మ అంత్యక్రియలలో నల్లగొండ డీఎస్పీ సుధాకర్, శాలీగౌరారం, నకిరేకల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రు, మహిళా పోలీసు సంఘం జిల్లా ప్రతినిధి సైదాభి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.