జమ్మలమడుగు: పట్టణంలో నాగులకట్ట ప్రాంతానికి చెందిన నూర్జహాన్(50) కరెంటు షాక్‌కు గురై మృతి చెందగా, ఆమె కోడలు మహబూబ్‌బీ గాయాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం నూర్జహాన్, మహబూబ్‌బీ కలిసి దుస్తులు ఉతికి ఆరవేయసాగారు. రెండు రోజులుగా వర్షం పడుతుండటంతో ఇంటి ఆవరణలో ఉన్న రేకులకు అర్తు వైరు తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతోంది. ఇంటి ముందు భాగంలో వారు రేకులను వంచుకున్నారు. ఆ రేకుల షెడ్డు నుంచి చెట్టుకు దుస్తులను ఆరవేసేందుకు ఇనుప తీగను లాగారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్న విషయం తెలియక నూర్జహాన్ దుస్తులను ఆరవేసే ప్రయత్నం చేసింది. కరెంటు షాక్‌తో అల్లాడుతున్న అత్తను గమనించకుండా కోడలు ఆరవేసే ప్రయత్నం చేయడంతో షాక్‌కు గురైంది. తీగలను పట్టుకుని ఇద్దరూ ఊగుతుండటంతో పక్కనే ఉన్న యువకుడు రాజు గమనించి పరుగున వచ్చి కర్ర సాయంతో మహబూబ్‌బీని రక్షించాడు. ఎక్కువ సమయం కావడంతో నూర్జహాన్‌కు కరెంటు తీగ అతుక్కు పోయింది. ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన మహబూబ్‌బీని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు తరలించారు. ఆమె గర్భవతి. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసులు, విద్యుత్‌శాఖాధికారులు పరిశీలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.