నిందితురాలు ప్రవల్లికను చూపిస్తున్న పోలీసులు
హయత్‌నగర్: వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై అనుమానాస్పదంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని బాలుడితో కలిసి భార్యే అతడిని చంపి.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించినట్టు తేల్చారు. బాలుడితో పాటు మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మార్కెట్ కమిటీలో ఉద్యోగిగా పనిచేసిన మెండెం పుల్లయ్య, ప్రవల్లిక దంపతులకు ఇద్ద రు పిల్లలు.
ఆరు నెలల క్రితం వరుసకు మేనల్లుడయ్యే ఓ బాలుడితో ప్రవల్లిక ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పుల్లయ్యకు ఈ విషయం తెలిసి బాలుడిని హెచ్చరించాడు. అయినా బాలుడు ప్రవల్లిక వద్దకు రావడం మానలేదు. దీంతో పుల్లయ్య భార్యాపిల్లలను తీసుకుని నగరానికి వచ్చి ఎల్బీనగర్ మైత్రినగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 22న పుల్లయ్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలుడు వచ్చా డు. 23న ఇంటికి వచ్చిన పుల్లయ్యకు భార్యతో బాలు డు కనిపించాడు.
కోపం కట్టలు తెంచుకున్న అతను ఇద్దరినీ కొట్టి.. బాలుడిని తన ఇంటి నుంచి పంపేశాడు. అనంతరం బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న పుల్లయ్యను ప్రవల్లిక, బాలుడు కలిసి కొట్టి.. తలను గోడకేసి బాది చంపేశారు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక 24వ తేదీ రాత్రి వరకు వేచి చూశారు. 25న ఆసుపత్రిలో ఉన్న తమ బంధువులను చూసి వస్తామని పక్కింటి వ్యక్తి దగ్గర బైక్ తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని పడేద్దామని బైకు మధ్యలో పెట్టుకొని బాలుడు, ప్రవల్లిక బయలుదేరారు.
మృతదేహం కాళ్లు వేలాడుతూ కనిపించడంతో పెద్దఅంబర్‌పేట వద్ద పెట్రోలింగ్ పోలీసులు బైక్‌ను ఆపారు. విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. 108 సిబ్బందిని పిలిపించగా బైకు మధ్యలో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు తేలింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రవల్లికతో పాటు బాలుడిని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని చెప్పారు. దీంతో నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు.