కాలువలో జారిపడి యువతి మృతి
కాలువలో జారిపడి యువతి మృతి
Published Sun, Jul 16 2017 12:28 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
మంచినీటి కోసం వెళ్లిన తల్లీకూతుళ్లు
బిందెతో నీళ్లు ముంచుతుండగా ప్రమాదం
పోలవరం కుడి కాలువలో దుర్ఘటన
రాంపాలెం(గోపాలపురం): మంచినీటి కోసం వెళ్లిన ఒక యువతి పొరబాటున పోలవరం కుడి కాలువలో జారి పడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు మండలంలోని రాంపాలెం గ్రామానికి చెందిన మందపాటి శ్రీనివాస్ కుమార్తె సంధ్య (20) తల్లి వెంకటదుర్గతో కలిసి సమీపంలోని పోలవరం కుడి ప్రధాన కాలువలో మంచినీటి కోసం వెళ్లింది. సంధ్య తన తల్లికి నీటి బిందెను అందించి రెండో బిందెతో నీళ్లు ముంచుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయింది. తల్లి వెంకట దుర్గ కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. రాత్రంతా గ్రామస్తులు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సంధ్య మృత దేహాన్ని వెలికి తీశారు. వీఆర్వో ఎన్.రాజేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై యు.లక్ష్మీనారాయణ తెలిపారు. కన్నకుమార్తె మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నాలుగు రోజులుగా నీటి కరువు
గ్రామస్తుల ఆగ్రహం
గ్రామంలో నాలుగు రోజుల నుంచి మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు.గోదావరి నుంచి అలందే సత్యసాయి మంచినీరు రాకపోవడంతో గ్రామస్తులు కాలువ వద్దకు నీటి కోసం వెళుతున్నామని వారు పేర్కొన్నారు. గ్రామంలో నీటి కరువు లేకపోతే కాలువ నీటి కోసం వెళ్లే పని ఉండేది కాదని, సంధ్య మృత్యువాత పడేది కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
Advertisement