కాటేసిన సవతి ‘ప్రేమ’ | Women Killed her Husband and son | Sakshi
Sakshi News home page

కాటేసిన సవతి ‘ప్రేమ’

Published Fri, Sep 16 2016 10:59 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

కాటేసిన సవతి ‘ప్రేమ’

కాటేసిన సవతి ‘ప్రేమ’

భర్త, కుమారుడి దారుణ హత్య
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం
మరో కుమారుడి పరిస్థితి విషమం


ఆమె పేరు ప్రేమ. కానీ ఆమె మనసు నిండా విషం దాగి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తను.. ముక్కుపచ్చలారని పిల్లలను కర్కశంగా కత్తితో పొడిచింది. భర్త, మరో బాలుడు ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో ఇంకో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది.


ప్రొద్దుటూరు క్రైం:  భర్త, పిల్లలపై అసూయ పెంచుకున్న ఓ సవతి తల్లి వారిని హత మారిస్తే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని భావించింది. పక్కా ప్లాన్‌తో భర్తతో పాటు పిల్లలిద్దరిని కత్తితో దారుణంగా పొడిచింది. భార్య చేతిలో భర్త సురేష్‌(48), మొదటి భార్య కుమారుడైన సుచి(15) మృతి చెందగా మరో కుమారుడు సుమేష్‌(11)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని త్రిశూర్‌ జిల్లా, పున్నగుళం మండలం, చిట్టెనూరు గ్రామానికి చెందిన శ్రాంబిక్కల్‌హౌష్‌ సురేష్‌ 15 ఏళ్ల క్రితం మైదుకూరుకు వచ్చి స్థిరపడ్డాడు. గుడ్‌బాయ్‌ అప్పడాల వ్యాపారం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలకు సరఫరా చేసేవాడు. అతనికి సుచి, సుమేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా సురేష్‌ మొదటి భార్య షీమోల్‌ను 12 ఏళ్ల క్రితం వదిలేశాడు. తర్వాత అతను అదే గ్రామానికి చెందిన ప్రేమ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సుప్రీమ్‌ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో సురేష్‌ ఏడాది క్రితం ప్రొద్దుటూరులోని కోనేటికాలువ వీధికి వచ్చి గుడ్‌బాయ్‌ అప్పడాల వ్యాపారం ప్రారంభించాడు. పట్టణంలోని సార్వకట్టవీధిలోని శ్రీగురురాఘవేంద్ర స్కూల్‌లో సుచి 8వ తరగతి చదువుతుండగా, సుమేష్‌ 5వ తరగతి చదువుతున్నాడు.

బంధువులకు రూ. 2లక్షలు డబ్బు ఇచ్చాడని..
మొదటి భార్య పిల్లల పట్ల ప్రేమ ఎప్పుడూ కపట ప్రేమ చూపేది. ఇంట్లో ఎప్పుడైనా మాంసాహారం చేసినా సుమేష్, సుచిలకు సరిగా పెట్టేది కాదు. అందువల్ల వారి ఆలనా పాలనా సురేష్‌ తల్లి సత్యభామ చూసుకునేది. పిల్లలపై అసూయతో ఎప్పుడూ వారిని తిట్టేది. ఇలా చేసినప్పుడల్లా భర్త ఆమెతో గొడవ పడేవాడు. ఇలా వారి మధ్య తరచూ గొడవ జరిగేది.  ఈ క్రమంలో సురేష్‌ 10 రోజుల క్రితం తన సోదరి వివాహం కోసం రూ. 2లక్షలు ఇచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని భార్య వారం రోజుల నుంచి భర్తతో గొడవ పడేది. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న భర్త ‘నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా.. నువ్వు ఎవ్వరూ చెప్పడానికి.. ఎక్కువగా మాట్లాడితే ఉరి వేసి చంపేస్తానని’ భార్యను హెచ్చరించాడు. తనను నిజంగానే భర్త చంపేస్తాడేమోనని ఆమె భావించింది. దీంతో భర్తతో పాటు పిల్లలిద్దరిని చంపేస్తే వారి ఆస్తి తన కుమారుడికి వస్తుందని, అంతేకాకుండా వారిని వదిలించుకొని సుఖంగా ఉండవచ్చని ఆమె అనుకుంది.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యా భర్తలిద్దరూ గొడవ పడ్డారు. భర్త, పిల్లలను హతమార్చాలని పక్కాగా ప్రణాళిక రూపొందించింది. గురువారం వేకువజామున అందరూ నిద్రిస్తుండగా ఆమె భర్త గదిలోకి వెళ్లి పిడి బాకుతో అతి కిరాతకంగా పొడిచేసింది. అతను గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో ఉన్న కుమారులిద్దరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. వారిని కూడా అదే కత్తితో ఆమె ఇష్టానుసారంగా పొడిచింది. భర్త సురేష్, పెద్ద కుమారుడు సుచి కొన్ని నిమిషాల తర్వాత మృతి చెందారు. మరో కుమారుడు సుమేష్‌ అపస్మారక స్థితిలో పడిపోవడంతో చనిపోయాడని భావించిన ప్రేమ కింది గదిలోకి వచ్చి పడుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకై తన కుమారుడు సుప్రీమ్‌ను కత్తితో స్వల్పంగా గాయ పరచి, తాను కూడా గాయ పరుచుకుంది.

పని మనిషి రావడంతో ఘటన వెలుగులోకి..
ప్రొద్దుటూరుకు చెందిన శివ అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి సురేష్‌ వద్ద పని చేస్తున్నాడు. గురువారం ఉదయాన్నే అతను వచ్చి సురేష్‌ ఇంటి తలుపు తట్టాడు. ఎంత సేపు పిలిచినా లోపలి నుంచి ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. దీంతో అతను కిటికీS వద్దకు వెళ్లి ఇంట్లోకి చూడగా సురేష్‌ రక్తపు మడుగులో పడివున్నాడు. అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు తెరిచారు. ముందుగా గాయాలతో ఉన్న సుమేష్, సుప్రీమ్, ప్రేమలను ఆటోలో వన్‌టౌన్‌ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సుమేష్‌కు కత్తిపోట్లు ఎక్కువగా ఉండటంతో తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలియడంతో డీఎస్పీ పూజితానీలం, సీఐ బాలస్వామిరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారి కుటుంబ సన్నిహితుడు ఆవుల దస్తగిరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

నానమ్మ ఉండి ఉంటే..
సుమేష్, సుచిల బాగోగులు రోజూ వారి నాన్నమ్మ సత్యభామనే చూసుకునేది. మొదటి పిల్లలిద్దరూ నాన్నమ్మతోనే ఉండేవారు. సవతి తల్లి ప్రేమతో వారికి అనుబంధం తక్కువే అని చెప్పవచ్చు. కేరళలోని తమ బంధువులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సత్యభామ 20 రోజుల క్రితం అక్కడికి వెళ్లింది. ఆమె ముందు భార్యా భర్తలు గొడవ పడేవారు కాదు. ఆమె ఇంట్లో ఉండి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని బంధువులు చర్చించుకుంటున్నారు.

అమ్మే పొడిచింది..
 కుటుంబంలోని ఇద్దరు మృతి చెందారు, ముగ్గురు గాయపడ్డారు. అందరూ ప్రమాదకర స్థితిలో ఉండటంతో పోలీసులకు అర్థం కాలేదు. బయటి వ్యక్తులు వచ్చి డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారేమోనని భావించారు. అయితే గాయాలతో ఉన్న ప్రేమ కుమారుడు సుప్రీమ్‌ను ప్రశ్నించగా తమ అమ్మే తనను కత్తితో పొడిచిందని చెప్పాడు. దీంతో పోలీసులు ఈ సంఘటనపై ఒక అవగాహనకు వచ్చారు. కొంత సేపటి తర్వాత ఆమెను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఎవరి ప్రమేయమైనా ఉందా..
ఒక్క మహిళ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించిందంటే పోలీసులు విశ్వసించడం లేదు. మరో వ్యక్తి ప్రమేయంతో ఆమె దారుణానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయాల కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారించలేకపోతున్నారు. విషయం తెలియడంతో కేరళ నుంచి సురేష్‌ బంధువులు ప్రొద్దుటూరుకు బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement